చైనాలో చెలరేగిపోతున్న చికున్ గున్యా.. కొవిడ్-19 వ్యూహాలను అమలు చేస్తున్న అధికారులు

  • నిన్నటికి 7 వేలకు పైగా కేసులు
  • ఫోషాన్ అనే పారిశ్రామిక ప్రాంతంలోనే అత్యధిక కేసులు
  • ఆ ప్రాంతానికి వెళ్లవద్దని తమ పౌరులకు అమెరికా సూచన
  • నిల్వ నీటిని తొలగించని వారికి రూ. 1.15 లక్షల జరిమానా
  • తొలుత క్వారంటైన్ అమలు చేసి, ఆ తర్వాత ఎత్తివేసిన ప్రభుత్వం
  • కార్యాలయాల ముందు క్రిమిసంహారక మందు పిచికారీ 
చైనాలో చికున్‌గున్యా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు కఠిన నివారణ చర్యలు చేపట్టారు. దోమతెరల ఏర్పాటు, క్రిమిసంహారక మందులు చల్లడం,  నిలిచి ఉన్న నీటిని శుభ్రం చేయని వారికి భారీ జరిమానాలు విధించడం, దోమలు పుట్టే ప్రదేశాలను గుర్తించడానికి డ్రోన్‌లను ఉపయోగించడం వంటి చర్యలను వేగవంతం చేశారు.

బుధవారం నాటికి చైనాలో 7,000కు పైగా చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అధికశాతం హాంగ్‌కాంగ్‌కు సమీపంలో ఉన్న ఫోషాన్ అనే పారిశ్రామిక ప్రాంతంలోనే నమోదయ్యాయి. అయితే, కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చికున్‌గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకినవారికి డెంగ్యూ లాగా జ్వరం, కీళ్ల నొప్పులు వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

చైనా ప్రభుత్వ టీవీలో చూపించిన దృశ్యాల ప్రకారం అధికారులు నగరంలోని వీధులు, నివాస ప్రాంతాలు, నిర్మాణ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను చల్లుతున్నారు. అలాగే కార్యాలయాల ముఖ ద్వారం ముందు కూడా క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది గతంలో కొవిడ్-19 సమయంలో చైనా అనుసరించిన కఠిన వ్యూహాలను గుర్తు చేస్తోంది. 

బయట ఉన్న కుండలు, పూల కుండీలు లేదా ఇతర పాత్రలలో నిల్వ ఉన్న నీటిని తొలగించని వారికి 10,000 యువాన్‌లు (సుమారు రూ. 1.15 లక్షలు) వరకు జరిమానా విధించడంతో పాటు, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అమెరికా ఇప్పటికే తమ పౌరులను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు వెళ్లవద్దని సూచించింది.

భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు ఈ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యాయి. సాధారణంగా ఈ వ్యాధి ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ ఈసారి చైనాలో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. 2003లో సార్స్ వ్యాప్తి తర్వాత చైనా ఇలాంటి కఠిన చర్యలను అమలు చేయడంలో  నైపుణ్యం సాధించింది.

ప్రస్తుతం ఫోషాన్ నగరంలో చికున్‌గున్యా రోగులను కనీసం ఒక వారం పాటు ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. ఒక దశలో, ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించనప్పటికీ, రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్‌ను కూడా అమలు చేశారు, కానీ తర్వాత దానిని రద్దు చేశారు. దోమల లార్వాలను తినే చేపలను, ఈ వ్యాధిని మోసుకెళ్లే దోమలను తినడానికి పెద్ద దోమలను కూడా ఉపయోగించాలని ప్రయత్నించినట్టు నివేదికలు వచ్చాయి. 


More Telugu News