Telangana High Court: బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Telangana High Court Denies Abortion for 28 Week Pregnant Girl
  • బాలిక గర్భంలో కవలలు
  • ఈ దశలో గర్భస్రావం చేస్తే తల్లితోపాటు పిల్లలకు కూడా ప్రమాదమని వైద్యుల నివేదిక
  • ప్రసవం అయ్యే వరకు బాలికను డిశ్చార్జ్ చేయవద్దని నిలోఫర్ ఆసుపత్రికి ఆదేశాలు
బాలిక అవాంఛిత గర్భాన్ని తొలగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గర్భం 28 వారాలు దాటిందని, ఈ దశలో గర్భస్రావం చేయడం తల్లితో పాటు కడుపులోని కవలలకు కూడా ప్రమాదకరమని వైద్య నివేదిక స్పష్టం చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

చట్టం ప్రకారం అబార్షన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌కు చెందిన బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ నాగేశ్ భీమపాక వెంటనే వైద్య నిపుణులతో కూడిన బోర్డు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

వైద్య నివేదిక ప్రకారం ఆ బాలిక 28 వారాల గర్భంతో ఉందని, కడుపులో కవలలు ఉన్నారని తేలింది. ఈ దశలో గర్భస్రావం చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు నివేదించారు. వైద్య నివేదికను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, అబార్షన్‌కు అనుమతి నిరాకరించారు. 

బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు జడ్జి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రసవం అయ్యే వరకు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకూడదని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, మహిళా, శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్ ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది.
Telangana High Court
Telangana
High Court
Abortion
Medical Termination of Pregnancy Act
Unwanted pregnancy
Niloufer Hospital
Sakhis Center
Child Welfare
Hyderabad

More Telugu News