Sourav Ganguly: మన క్రికెట్లో చాలా టాలెంట్ ఉంది: గంగూలీ

Sourav Ganguly India Has Plenty of Cricket Talent
  • మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారన్న సౌరభ్ గంగూలీ
  • ఇంగ్లాండ్ టూర్‌లో మన ఆటగాళ్ల బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమన్న గంగూలీ 
  • భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉందని, అది పెరుగుతూనే ఉంటుందన్న గంగూలీ
మన క్రికెటర్లలో చాలా టాలెంట్ ఉందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు సుదీర్ఘ ఫార్మెట్‌కు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా బ్యాటింగ్ విభాగం బలహీనపడుతుందని చాలా మంది భావించారు. 

కానీ పెద్దగా అనుభవం లేని మన యువ క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో తమ సత్తా చాటి అదరగొట్టారు. సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన టాప్ – 6 బ్యాటర్లలో మనోళ్లే నలుగురు ఉండటం గమనార్హం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2 తో ముగించడంలో భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సౌరభ్ గంగూలీ స్పందిస్తూ మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని అన్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో మన ఆటగాళ్లు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసిస్తూ భారత క్రికెట్ అలాగే ఉందన్నారు.

సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన తర్వాత ఆ లోటును సచిన్ టెండూల్కర్ భర్తీ చేశారని, అదే సమయంలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వచ్చారన్నారు. తదుపరి వచ్చిన విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్‌గా ఎదిగారన్నారు. కోహ్లీ తర్వాత యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ స్టార్స్‌గా మారారని తెలిపారు. భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉందని, అది పెరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.

మన దేశవాళీ క్రికెట్ చాలా బలంగా ఉందని అన్నారు. ఐపీఎల్, భారత్ ఏ జట్టు, అండర్ – 19 జట్టు రూపంలో మనకు చాలా వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను గెలవకపోయినప్పటికీ టీమిండియా ప్రదర్శనపై గంగూలీ సంతృప్తి వ్యక్తం చేశారు. శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్‌కు అభినందలు తెలిపిన గంగూలీ.. భారత టాప్ ఆరుగురు బ్యాటర్లు కేఏల్ రాహుల్, గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారని ప్రశంసించారు. 
Sourav Ganguly
Indian Cricket
India vs England
Yashasvi Jaiswal
Shubman Gill
Rishabh Pant
Virat Kohli
Rohit Sharma
Indian Batting
Cricket Talent

More Telugu News