Black Scorpion: నల్ల తేలు యమ డేంజర్... ఒక్క కాటుతో 25 రకాల విషాలు ఎక్కుతాయట!

Black Scorpion Venom Contains 25 Toxins Study Reveals
  • సాధారణ నల్ల తేలు కాటులో 25 రకాల ప్రాణాంతక విషాలు
  • కాలేయం, రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని వెల్లడి
  • గువాహటి ఐఏఎస్‌ఎస్‌టీ శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక విషయాలు
  • తూర్పు, దక్షిణ భారత అడవుల్లో ఈ తేలు జాతి అధికంగా గుర్తింపు
  • ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో విష ప్రభావం రుజువు
తేలు కుట్టింది కదా అని తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, దక్షిణ భారతదేశ అడవుల్లో కనిపించే నిగనిగలాడే నల్ల తేలు (Heterometrus bengalensis) కాటు అత్యంత ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. ఈ తేలు కుట్టినప్పుడు ఒకేసారి 25 రకాల ప్రాణాంతక విష రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కాలేయం, రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని గువాహటికి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST) పరిశోధకులు కనుగొన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ స్వయంప్రతిపత్తి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్. కె. ముఖర్జీ, రీసెర్చ్ స్కాలర్ సుస్మితా నాథ్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. మన దేశంలో ఈ నల్ల తేలు కాటు కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని విషంపై ఇప్పటివరకు పెద్దగా శాస్త్రీయ అధ్యయనాలు జరగలేదని వారు తెలిపారు. ఈ లోటును పూడ్చేందుకే తాము పరిశోధన చేపట్టినట్లు వివరించారు.

స్పెక్ట్రోమెట్రీ, బయోకెమికల్ విశ్లేషణల ద్వారా ఈ తేలు విషంలో 8 విభిన్న ప్రొటీన్ కుటుంబాలకు చెందిన 25 కీలక విష రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషం ఎంత ప్రమాదకరమో తెలుసుకునేందుకు స్విస్ అల్బినో జాతి ఎలుకలపై ప్రయోగించారు. విషం ఎలుకల శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వాటి కాలేయానికి సంబంధించిన ఎంజైమ్‌ల స్థాయులు విపరీతంగా పెరిగాయని, కీలక అవయవాలు దెబ్బతిన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

"విషం శరీరంలోకి చేరగానే ఒక రకమైన విష తుపానును సృష్టించింది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ అసాధారణ రీతిలో స్పందించింది. ఇది నిజ జీవితంలో మనుషులకు తేలు కుట్టినప్పుడు షాక్ లేదా తీవ్రమైన అలర్జీలకు దారితీసే ప్రమాదం ఉందని సూచిస్తోంది" అని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన వివరాలు 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ మాక్రోమ్యాక్యుల్స్'లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన తేలు కాటుకు మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Black Scorpion
Heterometrus bengalensis
scorpion venom
IASST
Ashish K Mukherjee
Susmita Nath
scorpion bite
toxins
liver damage
immune system

More Telugu News