Anushka Shetty: అనుష్క కొత్త చిత్రం 'ఘాటి' ట్రైలర్ విడుదల... రక్తం, చెమట, రాళ్లతో చెక్కిన కథ!

Anushka Shettys Ghaati Trailer Released A Story Carved with Blood Sweat and Stones
  • అనుష్క, క్రిష్  కాంబోలో ‘ఘాటి’ చిత్రం
  • ట్రైలర్ ను లాంచ్ చేసిన మేకర్స్
  • ప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ రిలీజ్
  • గంజాయి స్మగ్లర్లపై తిరగబడే జంట కథ
  • వేదం తర్వాత అనుష్క, క్రిష్‌ల కాంబినేషన్
  • యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం
బ్లాక్‌బస్టర్ చిత్రం 'వేదం' తర్వాత క్వీన్ అనుష్క శెట్టి, విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఘాటి'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన ఉత్కంఠభరితమైన ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. దీంతో పాటు సినిమా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా ఒక బలమైన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఘాట్ ప్రాంతంలో నివసించే ప్రేమ జంటగా అనుష్క, తమిళ నటుడు విక్రమ్ ప్రభు కనిపించారు. అక్కడి పేద గిరిజనులను (ఘాటీలు) అడ్డం పెట్టుకుని స్మగ్లర్లు సరిహద్దులు దాటించి గంజాయి రవాణా చేస్తుంటారు. స్థానికులను కించపరుస్తూ, వారిని కేవలం కూలీలుగానే చూసే స్మగ్లర్ల ఆగడాలను ట్రైలర్‌లో చూపించారు. తొలుత బస్ కండక్టర్‌గా అనుష్క, ఒక డిస్పెన్సరీలో పనిచేసే యువకుడిగా విక్రమ్ ప్రభు కనిపించారు. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట, స్మగ్లర్ల చేతిలో అన్యాయానికి గురవుతున్న తమ వాళ్ల కోసం ఎలా తిరగబడ్డారన్నదే ఈ సినిమా కథాంశంగా అర్థమవుతోంది.

నిజానికి ఈ చిత్రాన్ని మొదట జూలై 11న విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 5ని కొత్త విడుదల తేదీగా ఖరారు చేశారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు 'దేశి రాజు' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఏకంగా 8 కిలోల బరువు తగ్గినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. యూవీ క్రియేషన్స్‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా కావడం విశేషం.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "బాధితుడు, నేరస్థుడు, లెజెండ్" అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని వైరుధ్యమైన పాత్రల స్వభావాన్ని సూచిస్తోంది. ఈ చిత్రానికి నాగవేల్లి విద్యా సాగర్ సంగీతం అందించగా, మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా, సాయి మాధవ్ బుర్రా సంభాషణల రచయితగా వ్యవహరిస్తున్నారు.
Anushka Shetty
Ghaati movie
Vikram Prabhu
Krish Jagarlamudi
Telugu cinema
Action thriller
Ganja smuggling
UV Creations
Rajeev Reddy
Sai Babu Jagarlamudi

More Telugu News