ఇవి టెక్ రాఖీలు... ప్రత్యేకతలు ఇవే!

  • సాధారణానికి భిన్నంగా టెక్నాలజీ జోడించి రూపొందించిన రాఖీలు
  • అబ్బురపరుస్తున్న ఏలూరు యువకుడు సాయివర్థన్ వినూత్న ఆలోచన
  • రాఖీపై ఫోటో కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వినసొంపైన పాట
సోదర సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా జరుపుకునే పండుగ రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి). ఈ పండుగ రోజున అక్కచెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి సంతోషిస్తారు. అదే విధంగా సోదరులు సైతం రాఖీ కట్టిన సోదరీమణులకు బహుమతులు అందించి తమ అనురాగాన్ని చాటుకుంటారు.

ఇప్పుడు రాఖీ పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్‌లో రకరకాల రాఖీలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే ఈసారి రాఖీలకు సాంకేతికతను జోడించి వినూత్నంగా తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏలూరు ఆర్.ఆర్. పేటకు చెందిన సన్ రైజ్ ప్రింట్ స్పాట్ నిర్వాహకుడు సాయి వర్ధన్ రాఖీల తయారీలో ఒక వినూత్న ఆలోచన చేశారు.

వినియోగదారులకు కావలసిన విధంగా ఫోటోలు, పేర్లతో కూడిన రాఖీలను కంప్యూటర్, లేజర్ యంత్రాలతో డిజైన్ చేసి అందిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఫోటో కింది భాగంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ స్పోటిఫై యాప్‌లో స్కాన్ చేస్తే శ్రవణానందకరంగా పాట వచ్చేలా డిజైన్ చేశారు.

ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్లు తీసుకుని కొరియర్ ద్వారా దేశ విదేశాలకు పంపిస్తున్నామని సాయి వర్ధన్ తెలిపారు. వీటిని చూసిన వారు టెక్నాలజీ జోడించి రూపొందించినందున వీటిని టెక్ రాఖీలుగా అభివర్ణిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ శనివారం దేశ వ్యాప్తంగా భారతీయులు రాఖీ పండుగను జరుపుకోనున్నారు. 


More Telugu News