ఏపీకే ఫ్రాడ్.. ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం.. కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ హెచ్చరిక!

  • 'ఏపీకే ఫ్రాడ్' పేరుతో విస్తరిస్తున్న కొత్తరకం సైబర్ మోసాలు
  • రీ-కేవైసీ, ఐటీ రీఫండ్ అంటూ హానికరమైన లింకులు
  • లింక్ క్లిక్ చేస్తే ఫోన్ నియంత్రణ నేరగాళ్ల చేతికి
  • నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ
  • తెలియని లింకులు క్లిక్ చేయవద్దని బ్యాంకు సూచ‌న‌
ఒక్క క్లిక్.. మీ బ్యాంకు ఖాతాను పూర్తిగా ఖాళీ చేయగలదు! ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త వల ఇది. ‘ఏపీకే ఫ్రాడ్’ పేరుతో విస్తరిస్తున్న ఈ సరికొత్త మోసంపై దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. తెలియని వ్యక్తులు పంపే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఎలా మోసం చేస్తారంటే?
సైబర్ కేటుగాళ్లు బ్యాంకు లేదా ప్రభుత్వ అధికారులమని నమ్మించి, ఎస్సెమ్మెస్ లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా బాధితులకు ఓ ఫేక్ ఏపీకే ఫైల్ లింక్‌ను పంపుతారు. రీ-కేవైసీ పూర్తి చేయాలని, ఆదాయపు పన్ను రీఫండ్ వచ్చిందని లేదా జరిమానా చెల్లించాలని నమ్మబలుకుతారు. వారి మాటలు నమ్మి ఆ లింక్‌ను క్లిక్ చేసి, యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే అసలు మోసం మొదలవుతుంది.

ఆ యాప్ ద్వారా ఫోన్‌లోకి ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్ (మాల్‌వేర్) ప్రవేశిస్తుంది. దీంతో ఫోన్ నియంత్రణ పూర్తిగా మోసగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. మీ కాల్స్‌ను దారి మళ్లించడం, మీకు వచ్చే మెసేజ్‌లను (ఓటీపీలతో సహా) చదవడం, మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం వంటివి చేయగలరు. ఈ సమాచారంతో మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతా నుంచి నిమిషాల వ్యవధిలో డబ్బును తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు. ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చాకే బాధితులు తాము మోసపోయామని గ్రహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులే లక్ష్యంగా ఈ తరహా మోసాలు తీవ్రమవుతున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోసగాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, కార్డు పాయింట్లు రీడీమ్ చేసుకోవాలంటూ సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని వారు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తెలియని లేదా ధ్రువీకరించని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సూచించింది. మొబైల్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని, బలమైన పాస్‌వర్డ్‌లతో భద్రతను పటిష్ఠం చేసుకోవాలని కోరింది. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే, తక్షణమే బ్యాంకుకు సమాచారం అందించాలని స్పష్టం చేసింది.


More Telugu News