రూ.5 కోట్లు మిగిల్చాడు... లోకేశ్ కనగరాజ్ పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

  • రజనీకాంత్ హీరోగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ
  • విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున 
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ్  స్పీచ్ 
  • పెద్ద సినిమాను అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడం లోకేశ్ ప్రతిభకు నిదర్శనమని కితాబు
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషననల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కోసం కేటాయించిన బడ్జెట్‌లో ఏకంగా 5 కోట్ల రూపాయలు మిగిల్చాడని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, "ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది నేను చెప్పను. కానీ బ్యాంకాక్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు లోకేశ్ నా దగ్గరికొచ్చి, 'సార్.. మనకు ఇచ్చిన బడ్జెట్‌లో ఇంకా 5 కోట్లు మిగిలాయి. సినిమా పూర్తయిపోయింది' అని చెప్పాడు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇంత పెద్ద సినిమాను అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయడం లోకేశ్ ప్రతిభకు నిదర్శనం" అని తెలిపారు.

లోకేశ్ పనిచేసే విధానాన్ని కూడా నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారు. "అతను ఆరు కెమెరాల సెటప్‌తో పనిచేస్తాడు. చాలా వరకు సన్నివేశాలను ఒకే టేక్‌లో పూర్తిచేశాడు. సినిమా రష్ చూశాక, నేను ఇంత బాగా నటించానా అని నాకే అనిపించింది. ఈ చిత్రంలో నాది నెగెటివ్ రోల్ అయినా, ఆ పాత్ర చేసిన అనుభవం మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంది. సత్యరాజ్, శ్రుతి హాసన్, ఉపేంద్ర వంటి వారంతా అద్భుతంగా నటించారు" అని అన్నారు.

రజినీకాంత్ 171వ చిత్రంగా వస్తున్న 'కూలీ' గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజినీకాంత్, సత్యరాజ్ కలిసి నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News