PM Modi-Trump: అమెరికా-భారత్ దోస్తీకి బ్రేక్? దెబ్బతిన్న మోదీ-ట్రంప్ స్నేహబంధం!

Trump Modi friendship faces challenges over tariffs and Russia ties
  • ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న భారత్-అమెరికా మధ్య ముదిరిన విభేదాలు
  • భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం
  • రష్యాతో భారత్ చమురు, సైనిక ఒప్పందాలే కారణమని చెబుతున్న అగ్ర‌రాజ్యం
  • భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • రష్యా నుంచి కొనుగోళ్లు ఆపేది లేదని స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బలమైన స్నేహబంధంతో కళకళలాడిన భారత్-అమెరికా సంబంధాలు ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇరు దేశాల మధ్య విధానపరమైన విభేదాలు పెరగడం, అమెరికా ఏకపక్షంగా సుంకాలు విధించడంతో పరిస్థితి సంక్షోభంలో పడింది.

ఈ ఏడాది ఆరంభంలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వైట్‌హౌస్‌ను సందర్శించిన తొలి ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. ఆ సమయంలో ఇరువురు నేతలు ఒకరినొకరు "మంచి మిత్రులు"గా అభివర్ణించుకున్నారు. రక్షణ, ఇంధనం, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కానీ, కొన్ని నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

గత నెల‌లో భారత వస్తువులపై 25 శాతం భారీ సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. పశ్చిమ దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా భారత్.. రష్యా నుంచి చమురు, సైనిక సామగ్రిని కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని అమెరికా పేర్కొంది. మాస్కోతో సంబంధాలు తగ్గించుకోకపోతే మరింత కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.

అంతటితో ఆగకుండా, "భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది (డెడ్)" అంటూ ట్రంప్ సోషల్ మీడియాలో  బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాడి, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వాణిజ్య చర్చలు నిలిచిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో, పాకిస్థాన్‌లో భారీ చమురు నిల్వల వెలికితీతకు అమెరికా కంపెనీలు సహకరిస్తాయంటూ ఆ దేశంతో ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించడం న్యూఢిల్లీని మరింత కలవరానికి గురిచేసింది.

అయితే, అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గడం లేదు. రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ప్రత్యక్ష అమెరికా ఆంక్షలు లేనందున, వాటిని కొనసాగిస్తామని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో, అమెరికాను సంతృప్తి పరిచేందుకు ఆ దేశం నుంచి అధిక ధరకు ముడి చమురు కొనుగోళ్లను పెంచుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి భారత్ చమురు దిగుమతులు 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
PM Modi-Trump
Donald Trump
PM Modi
India US relations
India America friendship
US tariffs on India
India Russia relations
India oil imports
US Pakistan relations
India trade
Modi Trump friendship

More Telugu News