గంభీర్ కంట కన్నీరు.. టీమిండియా హెడ్ కోచ్‌లో ఈ కోణం ఎప్పుడూ చూసి ఉండరు!

  • ఇంగ్లండ్‌పై చివరి టెస్టులో టీమిండియా ఉత్కంఠ విజయం
  • ఆరు పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన భారత్
  • డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగానికి లోనైన కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆనందంతో అరుస్తూ కంటతడి పెట్టుకున్న వైనం
  • గౌతీ ఎమోషనల్ అయిన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ
సాధారణంగా ఎంతో గంభీరంగా, సీరియస్‌గా కనిపించే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత టెస్టులో భారత్ విజయం సాధించగానే ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. గంభీర్ ఇలా ఎమోషనల్ అవడం చూసి అభిమానులతో పాటు, క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట‌ వైరల్‌గా మారాయి.

సోమవారం లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించింది. చివరి వరకు నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత స్వల్ప విజయం కావడం విశేషం. ఇంగ్లండ్ విజయానికి కేవలం 7 పరుగులు అవసరమైన దశలో, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఈ సమయంలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన యార్కర్‌తో గస్ అట్కిన్‌సన్‌ను క్లీన్ బౌల్డ్‌ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ గెలుపుతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలగా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. ఆనందంతో గట్టిగా అరుస్తూ, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను ఎగిరి కౌగిలించుకున్నారు. అనంతరం కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఈ అరుదైన క్షణాలను బీసీసీఐ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ విజయం అనంతరం గంభీర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం.. కానీ ఎప్పటికీ లొంగిపోం. కుర్రాళ్లు అదరగొట్టారు!" అంటూ జట్టు స్ఫూర్తిని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. ఆయనలోని ఈ కొత్త కోణం, జట్టు పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.




More Telugu News