ఆపరేషన్ సిందూర్ పై జయాబచ్చన్ వ్యాఖ్యలకు.. ఢిల్లీ సీఎం రేఖ గట్టి కౌంటర్

  • ఆపరేషన్ సిందూర్ పేరు ఎందుకు పెట్టారన్న జయాబచ్చన్
  • కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదన్న రేఖా గుప్తా
  • ఆమెకు సినిమాలు మాత్రమే తెలుసని ఎద్దేవా
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. చర్చ సందర్భంగా బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

జయాబచ్చన్ వ్యాఖ్యలకు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు కేవలం సినిమాలు మాత్రమే తెలుసని, తమకు దేశం తెలుసని అన్నారు. సినిమా భాషలోనే ఆమెకు సమాధానం ఇస్తానని... ఆమెకు దేశ వాస్తవ పరిస్థితుల గురించి తెలియదని ఎద్దేవా చేశారు. కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదని అన్నారు. మహిళలు వితంతువులు అయినప్పుడు సిందూరాన్ని కోల్పోతారని... అందుకే దానికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారని వివరించారు. 

ఇదే సమయంలో విపక్షాలపై కూడా రేఖా గుప్తా విమర్శలు గుప్పించారు. దేశాన్ని ప్రేమించలేరు కానీ... దేశ వ్యతిరేక శక్తులను మాత్రం ప్రేమిస్తారని మండిపడ్డారు. భారతీయులమని చెప్పుకుంటూ... పాకిస్థాన్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ తో భారత్ సరైన సమాధానం ఇచ్చిందని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చిన గౌరవం ఆపరేషన్ సిందూర్ అని చెప్పారు.


More Telugu News