ఆ ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్ వారే అని చెప్పేందుకు ఇవిగో ఆధారాలు!

  • జులై 28న ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
  • ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాన్ని రుజువు చేసిన ఫోరెన్సిక్, బాలిస్టిక్ ఆధారాలు
  • పాకిస్థానీ ఓటర్ గుర్తింపుకార్డులు, వేలి ముద్రలు, ముఖ టెంప్లేట్‌లు, కుటుంబ వివరాలు లభ్యం
శ్రీనగర్‌లోని హర్వాన్‌లో జులై 28న జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్‌’లో ముగ్గురు లష్కర్-ఎ-తాయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల హత్యకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. ఫోరెన్సిక్, బాలిస్టిక్ ఆధారాలు ఈ ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.

హతమైన ఉగ్రవాదుల నుంచి రెండు పాకిస్థానీ ఓటరు గుర్తింపు కార్డులు లభించాయి. అవి సులేమాన్ షా, అబూ హమ్జా పేరిట ఉన్నాయి. అలాగే, కరాచీలో తయారైన 'కాండీల్యాండ్', 'చోకోమాక్స్' చాక్లెట్ రేపర్లు కూడా లభ్యమయ్యాయి. దెబ్బతిన్న ఉపగ్రహ ఫోన్‌లో లభించిన మైక్రో-ఎస్డీ కార్డులో పాకిస్థాన్ నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (ఎన్ఏడీఆర్ఏ)కి చెందిన బయోమెట్రిక్ రికార్డులు ఉన్నాయి. వీటిలో వేలిముద్రలు, ముఖ టెంప్లేట్‌లు, కుటుంబ వివరాలు లభించాయి. వీరి నమోదిత చిరునామాలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని చంగా మాంగా, కోయియాన్ గ్రామాలవిగా గుర్తించారు.

బాలిస్టిక్.. డీఎన్ఏ విశ్లేషణ 
పహల్గామ్‌లోని బైసారన్ లోయలో లభించిన 7.62x39 ఎంఎం షెల్ కేసింగ్‌లు, ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు ఏకే -103 రైఫిల్స్‌పై ఉన్న గుర్తులతో ఇవి సరిపోలాయి. ఆరుగురు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతేకాకుండా, పహల్గామ్‌లో దొరికిన రక్తం నుంచి సేకరించిన డీఎన్ఏ.. హతమైన ఉగ్రవాదుల డీఎన్ఏతో సరిపోలింది.

దాడి సూత్రధారులు ఎవరు?
ఈ ఉగ్రవాదుల్లో సులేమాన్ షా అలియాస్ ఫైజల్ జట్‌ను పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా, షూటర్‌గా గుర్తించారు. అబూ హమ్జా అలియాస్ హబీబ్ తాహిర్ రెండో షూటర్‌గా, యాసిర్ అలియాస్ జిబ్రాన్‌ను మూడో షూటర్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ ఎల్‌ఈటీలో ఏ-కేటగిరీ ఉగ్రవాదులుగా ఉన్నారు.

ఈ ఉగ్రదాడిలో తమ పాత్ర లేదని వాదిస్తున్న పాక్ వాదనలను ఈ ఆధారాలు తోసిపుచ్చాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని భారత్ చేస్తున్న ఆరోపణలకు ఈ ఆధారాలు మరింత బలం చేకూర్చాయి. భారత భద్రతా దళాలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ఉగ్రవాదులను గుర్తించి, నిర్మూలించడంలో సఫలమయ్యాయి.


More Telugu News