Hyderabad Drugs Party: హైదరాబాద్ శివారులో డ్రగ్స్ పార్టీ .. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్టు

Hyderabad Drugs Party 6 IT Employees Arrested
  • ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకున్న ఐటీ ఉద్యోగులు
  • అర్ధరాత్రి ఆకస్మికంగా ఫామ్ హౌస్‌పై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 
  • ఫామ్ హౌస్ నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ హైదరాబాద్ శివారులో గుట్టుచప్పుడు కాకుండా అక్కడక్కడా డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పబ్, రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీల కల్చర్ పెరిగింది. కొందరు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు డ్రగ్స్‌కు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులు పోలీసులకు చిక్కారు.

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో జరిగింది. నిందితుల నుంచి 0.5 గ్రాముల ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 20 గ్రాముల హ్యాష్ ఆయిల్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చేవెళ్ల ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి నిన్న మీడియాకు తెలియజేశారు.

ఐటీ ఉద్యోగులైన అభిజిత్ బెనర్జీ, సింప్సన్, పార్ధు, గోయల్, యశ్వంత్ రెడ్డి, సెవియో డెన్నిస్‌లు మొయినాబాద్ మండలం మేడిపల్లిలోని సెరీస్ ఆర్చర్ట్స్ ఫామ్ హౌస్‌లో పార్టీ చేసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ సీఐ బిక్షపతి, ఎస్ఐ బాలరాజు సిబ్బందితో అర్ధరాత్రి దాడి చేశారు.

ఆరుగురిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా, వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఫామ్ హౌస్ నిర్వహకుడిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
Hyderabad Drugs Party
Drugs
Hyderabad
IT Employees
LSD
Hash Oil
Cyberabad
Telangana
Moinabad

More Telugu News