Raj Thackeray: మహారాష్ట్రలో మరోమారు రెచ్చిపోయిన రాజ్‌థాకరే మద్దతుదారులు.. డ్యాన్స్ బార్ ధ్వంసం

Raj Thackeray Supporters Vandalize Dance Bar in Maharashtra
  • పన్వేల్‌లో నైట్ రైడర్స్ బార్‌పై కర్రలతో దాడిచేసి విధ్వంసం
  • ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే వ్యాఖ్యల తర్వాత ఘటన
  • దాడిని సమర్థించుకున్న ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే
మహరాష్ట్రలో రాజ్‌థాకరే మద్దతుదారులు మరోమారు రెచ్చిపోయారు. ముంబై సమీపంలోని పన్వేల్‌లో గత రాత్రి డ్యాన్స్‌బార్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రాయ్‌గడ్ జిల్లాలో డ్యాన్స్‌బార్లపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. 

డజను మందికిపైగా వ్యక్తులు కర్రలతో నైట్ రైడర్స్ బార్‌పై దాడిచేసి, ధ్వంసం చేశారు. లోపలికి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్‌తోపాటు మద్యం బాటిళ్లపై ప్రతాపం చూపించారు. బార్‌లోని టేబుళ్లు, అద్దాలు పగిలిపోయినట్టు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరాఠీ ఆత్మగౌరవం పేరుతో పదేపదే హింసకు మద్దతిస్తున్న రాజ్‌థాకరే నిన్న పన్వేల్‌లో జరిగిన కిసాన్ మజ్దూర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ శివాజీ మహరాజ్ రాజధాని అయిన రాయ్‌గడ్‌లో డ్యాన్స్ బార్లు ఉండటానికి వీల్లేదని అన్నారు. 

ఆయన వ్యాఖ్యలతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు చెలరేగిపోయారు. అర్ధరాత్రి డ్యాన్స్‌బార్‌కు చేరుకుని విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనను ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే సమర్థించుకున్నారు. దీనిని ఆయన ‘ప్రతీకాత్మక నిరసన’ (సింబాలిక్ ప్రొటెస్ట్)గా అభివర్ణించారు. బార్లు ఉండటం చట్ట విరుద్ధమని, అందుకనే వారు ఆ పని చేశారని చెప్పారు. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించాలని సూచించారు. కాగా, రాజ్‌థాకరే మద్దతుదారులు ఇటీవల మరాఠీయేతరులపైనా దాడికి పాల్పడ్డారు.
Raj Thackeray
Maharashtra
MNS
dance bar
Panvel
Mumbai
Raid
violence
Shivaji Maharaj
Sandeep Deshpande

More Telugu News