మంత్రి కొండా సురేఖ‌కు షాక్.. క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం

  • కేటీఆర్‌ పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్‌
  • ఆమెపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌న్న నాంప‌ల్లి కోర్టు
  • ఈ నెల‌ 21 లోపు ఆమెపై క్రిమిన‌ల్‌ కేసు నమోదు చేసి నోటీసులు అంద‌జేయాల‌ని ఆదేశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నటి సమంత విడాకుల వ్యవహారాల్లో కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఈ తీర్పు వచ్చింది.  

ప్రాథ‌మిక ఆధారాల‌ను ప‌రిశీలించిన కోర్టు.. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఆగస్టు 21 లోపు ఆమెపై క్రిమిన‌ల్‌ కేసు నమోదు చేసి నోటీసులు అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

ఇక‌, ఈ కేసుపై మంత్రి కొండా సురేఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో స్పందిస్తూ... న్యాయ‌వ్య‌వ‌స్థపై త‌న‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఈ కేసులు, కొట్లాట‌లు త‌న‌కు కొత్త కాద‌ని, త‌న జీవిత‌మే ఒక పోరాట‌మ‌ని పేర్కొన్నారు. 


More Telugu News