Nitin Gadkari: ఏపీకి గడ్కరీ భారీ కానుక.. రూ. 26 వేల కోట్లకు తక్షణ ఆమోదం, మరో లక్ష కోట్లకు హామీ

Nitin Gadkari Announces 26000 Crore Roads Package for Andhra Pradesh
  • 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • సీఎం అడగ్గానే.. రూ. 26 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు గడ్కరీ ఆమోదం
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మరో లక్ష కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి హామీ
  • సంపద సృష్టికి రహదారులే కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • గడ్కరీ అంటే వేగం, పట్టుదల అని కొనియాడిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ అండగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వేదిక పైనుంచే ఏకంగా రూ. 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి మరో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

శనివారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి పవన్
కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 2,852 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు, రూ. 2,381 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, సంపద సృష్టికి రహదారులే మూలమని స్పష్టం చేశారు. "ఉదయం అన్నదాత సుఖీభవతో సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. సాయంత్రం రహదారుల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టికి బాటలు వేస్తున్నాం. ఇది చరిత్రాత్మకమైన రోజు" అని ఆయన అభివర్ణించారు. నితిన్ గడ్కరీని 'పట్టుదల, కృషి, వేగానికి నిలువుటద్దం' అని కొనియాడిన చంద్రబాబు, ఆయన మాటలు అభివృద్ధిని ఆకాంక్షించే వారికి సంగీతంలా ఉంటాయని అన్నారు. గతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా గడ్కరీ పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో పూర్తి సహకారం అందిస్తామని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా తమ సొంత రాష్ట్రంగా భావించి అభివృద్ధికి సహకరించాలని ఆయన గడ్కరీని కోరారు.

సీఎం విజ్ఞప్తి మేరకు విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-మచిలీపట్నం రహదారులను ఆరు వరుసలుగా విస్తరించడం, గుంటూరు-వినుకొండ మధ్య నాలుగు వరుసల రహదారి వంటి కీలక ప్రాజెక్టులకు గడ్కరీ వేదికపై నుంచే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. గడ్కరీ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించామని, ఇప్పుడు అమరావతికి కూడా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం లభించిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
Nitin Gadkari
Andhra Pradesh roads
National highways development
Chandrababu Naidu
AP infrastructure
Vijayawada Hyderabad highway
Vijayawada Machilipatnam highway
Amaravati outer ring road
Guntur Vinukonda road
Road development projects

More Telugu News