Pushkar Singh Dhami: వైద్యుల నిర్లక్ష్యం.. ఏడాది బాబును ఐదు ఆసుపత్రులకు రిఫర్ చేసిన వైద్యులు.. డీహైడ్రేషన్‌తో బాలుడి కన్నుమూత

Pushkar Singh Dhami Orders Probe into Infant Death Case in Uttarakhand
  • బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఘటన
  • ఏడాది బాలుడిని ఐదు ఆసుపత్రుల చుట్టూ తిప్పించిన వైద్యులు
  • చివరికి చికిత్స పొందుతూ మృతి
  • విచారణకు ఆదేశించిన సీఎం పుష్కర్‌సింగ్ ధామి
ఉత్తరాఖండ్‌లోని ఐదు ఆసుపత్రుల నిర్లక్ష్యం ఏడాది బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కావడంతో స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైనికాధికారి దినేష్ చంద్ర జోషి ఏడాది కుమారుడైన శివాన్ష్‌కు జులై 10న డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో చమోలీలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్‌సీ)కి తీసుకెళ్లారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బాగేశ్వర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు రిఫర్ చేశారు.

సీహెచ్‌సీలో వైద్యం అందించినప్పటికీ బాలుడి పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు బాగేశ్వర్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. జిల్లా ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మొబైల్ ఫోన్‌ చూడడంలో బిజీగా ఉన్నారని, సరిగా పరీక్షించకుండానే అల్మోరాకు రిఫర్ చేశారని బాలుడి తండ్రి ఆరోపించారు. అక్కడ పీడియాట్రిక్ ఐసీయూ లేకపోవడం కూడా దీనికి ఒక కారణమని తెలుస్తోంది.

అంబులెన్స్ ఆలస్యం
బాలుడిని అల్మోరాకు తరలించడానికి 108కు ఫోన్ చేసినా, రెండున్నర గంటలు ఆలస్యంగా అంబులెన్స్ వచ్చింది. ఈ ఆలస్యంపై బాలుడి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శివాన్ష్‌ను ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తిప్పుతూ చివరికి హల్ద్వానీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ జులై 16న బాలుడు మరణించాడు. ‘వైద్య నిర్లక్ష్యం కారణంగా నా కొడుకును కోల్పోయాను’అని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పాటుపడుతున్న తాను, తన కొడుకును మాత్రం రక్షించుకోలేకపోయానని ఆయన రోదించారు.

ముఖ్యమంత్రి ధామి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. విచారణ తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Pushkar Singh Dhami
Uttarakhand
infant death
medical negligence
dehydration
hospital referral
negligence investigation
health services
Chamoli
Haldwani

More Telugu News