Manchu Vishnu: 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమా మెరిసింది.. విజేత‌ల‌కు కంగ్రాట్స్‌: మంచు విష్ణు

Manchu Vishnu Congratulates Winners of 71st National Film Awards
  • నిన్న‌ 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 
  • ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు 
  • విజేత‌ల‌పై వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల జల్లు 
  • అవార్డులు గెలిచిన వారికి ఎక్స్ వేదిక‌గా కంగ్రాట్స్ చెప్పిన మంచు విష్ణు
71వ జాతీయ చలనచిత్ర అవార్డులను నిన్న‌ సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈసారి ప్రకటించిన అవార్డులలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండిందనే చెప్పాలి. ఏకంగా ఏడు కేటగిరీల్లో తెలుగు సినిమాకు అవార్డులు లభించాయి. దీంతో విజేత‌ల‌పై వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

తాజాగా హీరో మంచు విష్ణు కూడా విజేత‌ల‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కంగ్రాట్స్ చెప్పారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు సినిమా మెరిసింది. మన తెలుగు ప్రతిభకు తిరుగులేదు. మీ కృషి భారతీయ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకువెళుతూనే ఉంది. అభినందనలు! అంటూ విష్ణు ట్వీట్ చేశారు.   

ఇక‌, బాలకృష్ణ హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వ‌చ్చిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ‘ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రం’ అవార్డును గెలుచుకుంది. అలాగే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్‌ సోషియో ఫాంటసీ ‘హను-మాన్‌’.. ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బెస్ట్‌ స్టంట్‌ కొరియోగ్రఫీ అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. 

అలాగే సాయిరాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా న‌టించిన ప్రేమకావ్యం ‘బేబీ’కి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ సింగింగ్‌ అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్‌, ఉత్తమ గాయకుడిగా పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ బాలనటి కేటగిరిలో ‘గాంధీతాత చెట్టు’ సినిమా నుంచి సుకృతి వేణి అవార్డుకు ఎంపికైంది. ఇక‌, ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటకుగాను కాసర్ల శ్యామ్‌ ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. 
Manchu Vishnu
71st National Film Awards
Telugu cinema
Bhagavanth Kesari
HanuMan
Baby movie
Sai Rajesh
Kasarla Shyam
Anand Devarakonda
Sukruthi Veni

More Telugu News