'డెడ్ హ్యాండ్' ప్రస్తావనతో ట్రంప్ సీరియస్.. రష్యాకు హెచ్చరికగా కీలక ఆదేశాలు

  • రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర స్పందన
  • రెండు అణు జలాంతర్గాములను కీలక ప్రాంతాలలో మోహరించాలని ఆదేశం
  • మాటలు ఊహించని పరిణామాలకు దారితీయవచ్చని ట్రంప్ వ్యాఖ్య
  • రష్యా 'డెడ్ హ్యాండ్' అణు వ్యవస్థను ప్రస్తావించడంతో పెరిగిన ఉద్రిక్తత
  • ఉక్రెయిన్ కాల్పుల విరమణకు రష్యాకు 10 రోజుల గడువు ఇచ్చిన ట్రంప్
అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో, రెండు అణు జలాంతర్గాములను (న్యూక్లియర్ సబ్‌మెరైన్లు) తక్షణమే కీలక ప్రాంతాలలో మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "మెద్వెదేవ్ చేసిన అవివేకపు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక అంతకంటే ఎక్కువ ప్రమాదం పొంచివుందేమోనన్న అనుమానంతోనే నేను రెండు అణు జలాంతర్గాములను తగిన ప్రాంతాలకు పంపాలని ఆదేశించాను. మాటలు చాలా ముఖ్యమైనవి, అవి ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ఇది అలాంటి సందర్భం కాకూడదని ఆశిస్తున్నాను" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

భారత్, రష్యాల ఆర్థిక వ్యవస్థలను 'చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థలు' అంటూ ట్రంప్ చేసిన విమర్శలకు బదులిస్తూ మెద్వెదేవ్ టెలిగ్రామ్‌లో ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన 'డెడ్ హ్యాండ్' (పెరిమీటర్) వ్యవస్థను ప్రస్తావించడం వివాదాన్ని రాజేసింది. దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ పూర్తిగా నాశనమైనప్పటికీ, శత్రువులపై అణు ప్రతిదాడిని స్వయంచాలకంగా ప్రారంభించే అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థే ఈ 'డెడ్ హ్యాండ్'. ఈ ప్రస్తావనతోనే ట్రంప్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా, అంతకుముందు ట్రంప్... రష్యా, అమెరికాల మధ్య పెద్దగా వ్యాపార లావాదేవీలు లేవని, అలాగే ఉండనివ్వాలని వ్యాఖ్యానించారు. రష్యా మాజీ అధ్యక్షుడైన మెద్వెదేవ్‌ను మాటలు అదుపులో పెట్టుకోవాలని, ప్రమాదకరమైన జోన్‌లోకి ప్రవేశిస్తున్నారని హెచ్చరించారు. మరోవైపు, ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు అంగీకరించాలని, లేదంటే తీవ్ర సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యాకు ట్రంప్ 10 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే, మాస్కో మాత్రం ఈ గడువుకు కట్టుబడే సూచనలు క‌నిపించడం లేదు.


More Telugu News