Yuzvendra Chahal: నాపై మోస‌గాడి ముద్ర వేశారు.. ధ‌న‌శ్రీ వ‌ర్మ‌తో విడాకుల‌పై తొలిసారి పెదవి విప్పిన చాహల్

Yuzvendra Chahal Breaks Silence On Divorce From Dhanashree Verma
  • విడాకుల తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి చాహ‌ల్ ఆవేద‌న‌
  • తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన చాహల్ 
  • విడాకుల త‌ర్వాత విమ‌ర్శ‌ల కార‌ణంగా తీవ్ర‌ మానసిక ఒత్తిడికి గుర‌య్యాన‌న్న క్రికెట‌ర్‌
  • ఆత్మ‌హ‌త్య‌ ఆలోచనలు కూడా వ‌చ్చాయ‌ని వెల్ల‌డి
  • స్నేహితుల మద్దతుతో మ‌ళ్లీ మామూలు జీవితం వైపు వ‌చ్చాన‌న్న చాహ‌ల్
టీమిండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్‌, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శల గురించి తాజాగా రాజ్ షమానీ పాడ్‌కాస్ట్ లో చాహల్ మాట్లాడాడు. కొంద‌రు త‌న‌పై మోస‌గాడి ముద్ర వేశార‌ని ఈ సంద‌ర్భంగా చాహ‌ల్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 

విడాకుల త‌ర్వాత ఎన్నో విమర్శలు.. 
"విడాకులు తీసుకున్న తర్వాత నాపై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది న‌న్ను మోస‌గాడిగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం రాదన్నారు. కానీ, నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్లతోనే పెరిగాను. మహిళల పట్ల గౌరవంగా ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నా తల్లిదండ్రులే నన్ను ఆ సంస్కారంతో పెంచారు. 

నేను ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. నా స్నేహితులు, కుటుంబసభ్యులకు ఆ విష‌యం తెలుసు. నేను ఎంత నమ్మకంగా ఉన్నానో వారికే తెలుసు. నా జీవితంలో ఉన్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాను. నిజానికి, మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఏం జరిగిందో కొంతమందికి అసలేమీ తెలియదు. అయినా వారు నన్నే తప్పుపట్టారు. నా వ్యక్తిగత జీవితాన్ని ఇష్టానుసారంగా వార్తలుగా మార్చేశారు. కేవలం వారి వ్యూస్ కోసం ఇలా చేశారు" అని చాహ‌ల్ అన్నాడు. 

మానసిక ఒత్తిడితో నిద్రలేమి.. ఆత్మ‌హ‌త్య‌ ఆలోచనలు..
"నా వ్యక్తిగత జీవితంపై వ‌చ్చిన క‌థ‌నాలు చూసి తీవ్ర ఆందోళనకు గుర‌య్యా. కొన్ని రోజుల పాటు రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయే వాడిని. ఇలా 45 రోజులు గడిచాయి. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాను. ఏ విషయంపైనా ధ్యాస పెట్టలేకపోయాను. సుమారు ఐదు నెలల పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాను. కొన్నిసార్లు నా అత్యంత సన్నిహిత మిత్రుడితో ఆత్మహత్య ఆలోచనలు కూడా పంచుకున్నాను. అది నిజంగా భయానకమైన అనుభవం" అని చాహల్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

అడ్డంకిగా మారిన కెరీర్‌..
"మేమిద్దరం కూడా మా కెరీర్‌లో విజయాన్ని సాధించాలనుకున్నాం. ఆ కారణంగా వ్యక్తిగత బంధానికి తగినంత సమయం ఇవ్వడం కష్టంగా మారింది. అప్పుడు రాజీ పడడం తప్ప ఇతర మార్గం ఉండదు. కానీ రెండు వ్యక్తుల లక్ష్యాలు, వ్యక్తిత్వాలు ఒకే దిశగా లేకపోతే ఆ ప్రభావం రిలేషన్‌పై పడక తప్పదు. కెరీర్‌ కీలక దశలో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలవడం అత్యంత అవసరం" అని చాహ‌ల్ వివరించాడు.

స్నేహితుల మద్దతుతో మ‌ళ్లీ మామూలు జీవితం వైపు..
"ఇలాంటి క్లిష్ట సమయంలో ఎక్కువగా నా వ్యక్తిగత విషయాలను స్నేహితులతో మాత్రమే చ‌ర్చించే వాడిని. నా కుటుంబ సభ్యులను ఆందోళనపెట్టే ఉద్దేశం నాకు ఉండదు. ప్రాతిక్ పవార్, ఆర్జే మహ్‌వషా, ఇంకా కొంతమంది నమ్మకమైన స్నేహితులు నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ల మద్దతుతోనే నేను మళ్లీ మామూలు జీవితం వైపు వచ్చాను. ఈ రోజు వాళ్లందరూ కూడా నా వెనుక నిలబడి ఉన్నారు" అని చాహల్ చెప్పుకొచ్చాడు.
Yuzvendra Chahal
Dhanashree Verma
Chahal Divorce
Indian Cricketer
Social Media Influencer
Marriage Breakup
Mental Health
Cricket Career
Yuzvendra Chahal Interview
Raj Shamani Podcast

More Telugu News