త్వరలో వారణాసిలో అర్బన్ రోప్ వే ప్రారంభం... హైదరాబాద్ సంస్థ ఘనత!

  • దేశంలో మొట్ట మొదటి అర్బన్ రోప్ వే వారాణాసిలో పూర్తి 
  • ఆగస్టులో ప్రారంభం కానున్న వైనం!
  • రోప్ వే నిర్మాణ పనులు పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ
భారతదేశంలోనే మొట్టమొదటి అర్బన్ రోప్‌వే ప్రాజెక్ట్‌గా వారణాసి రోప్‌వే త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మార్చి నెల నుంచే రోప్‌వే టెస్ట్ రన్‌లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ రోప్‌వే ప్రాజెక్టు ఆగస్టు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఓ తెలుగు సంస్థ పనితనం ఉండడం విశేషం. 

ప్రాజెక్ట్ వివరాలు
నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLMCL) ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.815 కోట్లు. 2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

ప్రత్యేకతలు
ఈ రోప్‌వే ప్రాజెక్టు ద్వారా నగరంలో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు ఇది సులభమైన పరిష్కారం. ప్రయాణ సమయం: గోడౌలియా నుండి కాంట్ రైల్వే స్టేషన్‌కు కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా 150 గోండోలాలు 45-50 మీటర్ల ఎత్తులో నడుస్తాయి. ఒక్కో గోండోలాలో గరిష్ఠంగా 10 మంది ప్రయాణించే వీలుంటుంది. గంటకు 3 వేల మందిని రవాణా చేయగల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వారణాసిలో రద్దీని తగ్గించి, యాత్రికులు, పర్యాటకులకు సౌకర్యవంతమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోప్‌వే ప్రారంభంతో వారణాసికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుందని ఆశిస్తున్నారు.
Your browser does not support HTML5 video.


More Telugu News