భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్

  • ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించిన ట్రంప్
  • అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్న ట్రంప్
  • మిత్ర దేశమైనప్పటికీ భారత్‌తో వ్యాపారం తక్కువేనని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చర్యలు చేపట్టారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రష్యా నుంచి భారత్ సైనిక ఉత్పత్తులను, ముఖ్యంగా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోందని ఆయన తెలిపారు. వాటిపై పెనాల్టీ విధించనున్నట్లు వెల్లడించారు. మిత్రదేశమైనప్పటికీ భారత్‌తో తమ వ్యాపారం తక్కువగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా విధించిన గడువు మేరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని ఆయన తెలిపారు. ఈ కారణంగా సుంకాన్ని విధించినట్లు వెల్లడించారు.

అయితే, ఆగస్టు 1 వరకు చర్చల్లో ఫలితం తేలకుంటే సుంకాన్ని విధిస్తానని ప్రకటించిన ట్రంప్, గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకొని సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. భారత్ రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగించడం, కొన్ని రోజులుగా రష్యా నుంచి ముడి చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


More Telugu News