Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 23 వేల మంది మహిళలు, అమ్మాయిల అదృశ్యం!

Missing 23000 women girls in Madhya Pradesh
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నకు అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సీఎం మోహన్ యాదవ్
  • పరారీలో 1500 మంది నిందితులు
  • నామమాత్రంగా నమోదవుతున్న కేసులు
  • నిందితులకు శిక్షలు అంతంత మాత్రమే
మధ్యప్రదేశ్‌లో 23,000 మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని, అలాగే మహిళలపై అత్యాచారం, ఇతర నేరాలకు సంబంధించిన 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారని ప్రభుత్వం అసెంబ్లీకి తెలియజేసింది. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి బాలా బచ్చన్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

2024 జనవరి 1 నుంచి 2025 జూన్ 30 వరకు రాష్ట్రంలో నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులపై, అలాగే అదృశ్యమైన మహిళలు, బాలికల సంఖ్యపై ఆయన జిల్లాల వారీగా వివరణాత్మక డేటాను బాలా బచ్చన్ కోరారు. అదృశ్యమైన బాధితుల్లో ఎంత మంది ఒక నెల కంటే ఎక్కువ కాలం నుంచి కనిపించడం లేదు, ఎంత మంది నిందితులను అరెస్టు చేశారు, ఎంత మంది ఇంకా పరారీలో ఉన్నారు అని కూడా బచ్చన్ ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు, పరారీలో ఉన్న నిందితులను అరెస్టుకు గడువు గురించి కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అసెంబ్లీకి సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. 2025 జూన్ 30 నాటికి, మొత్తం 21,175 మంది మహిళలు, 1,954 మంది బాలికలు ఏడాదికిపైగా అదృశ్యమయ్యారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళలు, బాలికల సంఖ్య మొత్తం 23,129కి చేరుకుంది.

మహిళలపై 292 మంది నిందితులు లైంగిక దాడికి పాల్పడగా, 283 మంది బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. ఇతర రకాల లైంగిక హింస కేసులలో 610 మంది నిందితులు (మహిళలపై 443 మంది, బాలికలపై 167 మంది) ఉన్నారు. అదృశ్య కేసులకు సంబంధించిన ఇతర నేరాలలో 320 మంది నిందితులు (మహిళలకు సంబంధించిన 76 మంది, బాలికలకు సంబంధించిన 254 మంది) ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన 1,500 మందికి పైగా నిందితులు ప్రస్తుతం గుర్తించబడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

జిల్లాల వారీగా అదృశ్య మహిళల హాట్‌స్పాట్‌లు
అనేక జిల్లాలు అదృశ్య మహిళల కేసుల్లో ప్రధాన హాట్‌స్పాట్‌లుగా నిలిచాయి, ప్రతి జిల్లాలో 500 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సాగర్ జిల్లాలో 1,069 మంది మహిళలు అదృశ్యమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత జబల్పూర్‌లో 946, ఇండోర్‌లో 788, భోపాల్ (గ్రామీణ)లో 688, ఛతర్పూర్‌లో 669, రేవాలో 653, ధార్‌లో 637,  గ్వాలియర్‌లో 617 కేసులు నమోదయ్యాయి.

 ఈ గణాంకాలు మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనను స్పష్టం చేస్తున్నాయి. గత డేటా ప్రకారం 2021 నుంచి 2024 వరకు 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు అదృశ్యమైనప్పటికీ, కేవలం 724 కేసులు మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. ఇండోర్‌లో 2,384 మంది మహిళలు అదృశ్యమైతే 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. సాగర్ జిల్లాలో అత్యధికంగా 245 మంది బాలికలు అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి.

అత్యాచార కేసుల విషయంలో 2024లో రాష్ట్రంలో రోజుకు సగటున 20 కేసులు నమోదయ్యాయి. 2020లో 6,134 కేసుల నుంచి 2024లో 7,294 కేసులకు 19 శాతం పెరుగుదల కనిపించింది. ధార్ జిల్లా గిరిజన మహిళలపై అత్యాచార కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 26 శాతం పెరుగుదల నమోదైంది.

అయితే, ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం చాలా తక్కువగా ఉంది. గత ఐదేళ్లలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 2,739 కేసుల్లో కేవలం 23 శాతం మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో 22 శాతం, ఇతర వెనుకబడిన తరగతులలో 21 శాతం, జనరల్ కేటగిరీలో 18 శాతం మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 

ఈ అదృశ్య కేసుల వెనుక మహిళలు, బాలికలను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసే రాకెట్ ఉందని, ఎక్కువగా ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చే మహిళలు ఈ పథకాలకు బాధితులవుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
Madhya Pradesh
Missing women
Missing girls
Mohan Yadav
Bala Bachchan
Human trafficking
Rape cases
Crime statistics
Indore
Sagar district

More Telugu News