సునామీ హెచ్చ‌రిక‌.. అమెరికాలోని భారతీయులకు ఇండియన్‌ కాన్సులెట్ కీలక సూచనలు

  • రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను తాకిన సునామీ 
  • ఈ నేపథ్యంలో అప్రమత్తమైన‌ అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్‌ 
  • అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్‌ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని భారత కాన్సులెట్‌ జనరల్‌ తెలిపింది. 

కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పింది. సునామీ హెచ్చరికలు జారీ చేస్తే వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.

తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికాలోని భార‌తీయులకు భారత కాన్సులేట్‌ జనరల్‌ సూచించింది. ఎమర్జెన్సీ సిట్యూయేషన్స్‌కు సిద్ధంగా ఉండాలని.. మీ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు చార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కోరింది. ఈ మేర‌కు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది: +1-415-483-6629

ఇప్ప‌టికే సునామీ హెచ్చ‌రిక‌లు జారీ
కాగా, రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో బుధ‌వారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.8గా నమోదైంది. రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌లోని హొక్కైడో దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కాగా, అమెరికా అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్‌లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News