Shubhjit Ballav: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 900కుపైగా సైబర్ మోసాలు.. బీహార్‌ దంపతుల అరెస్ట్!

Bihar Couple Arrested for 900 Cyber Fraud Cases Across India
  • దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు
  • తెలంగాణ వీరిపై 77 కేసులు 
  • బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌ల ముందు ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్‌లను లక్ష్యంగా చేసుకుని మోసాలు
గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 900కు పైగా సైబర్ మోసం కేసుల్లో నిందితులైన బీహార్‌లోని దర్భాంగాకు చెందిన దంపతులను పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులను శుభజిత్ బల్లవ్, రియా హల్దార్ బల్లవ్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో వీరు 900 మందికి పైగా వ్యక్తులను మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. 

కూచ్ బెహార్ పోలీసులు ఈ జంటను సోమవారం రాత్రి బీహార్‌లోని దర్భాంగాలోని ఒక హోటల్‌లో అరెస్టు చేశారు. వీరు వాస్తవానికి నదియా జిల్లాలోని రాణాఘాట్‌కు చెందినవారు. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒకసారి వీరిని అరెస్టు చేసినప్పటికీ, బెయిల్ పొందిన తర్వాత మళ్లీ మోసాలకు పాల్పడ్డారు.

మంగళవారం కూచ్ బెహార్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దుటీమన్ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ ఈ అరెస్ట్ గురించి వెల్లడించారు. "కూచ్ బెహార్‌లోని సాహెబ్‌గంజ్, తుఫంగంజ్ పోలీస్ స్టేషన్‌లలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గత రాత్రి బీహార్‌లోని దర్భాంగా ప్రాంతంలోని ఒక హోటల్ నుంచి భార్యాభర్తలను అరెస్టు చేశాం. వారిని ఈ రోజు ట్రాన్సిట్ రిమాండ్‌పై కూచ్ బెహార్‌కు తీసుకొచ్చాం" అని వివరించారు.

సరిహద్దు సమీపంలోని వివిధ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఔట్‌పోస్ట్‌ల ముందు ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్‌లను (సీఎస్‌పీ) ఈ జంట లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేది. బీఎస్ఎఫ్ బోర్డర్ ఔట్‌పోస్ట్ (బీవోపీ) సమీపంలో ఉన్న సీఎస్‌పీకి వచ్చే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని తెలియని మొబైల్ నంబర్ల నుంచి బీఎస్ఎఫ్ అధికారులు, కంపెనీ కమాండర్లు లేదా ఇన్‌స్పెక్టర్లుగా నటిస్తూ ఫోన్ కాల్స్ చేసేవారు.

షుభజిత్ ఫోన్ నంబర్‌ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ పోర్టల్‌లో తనిఖీ చేయగా, 2024లో 877 ఎఫ్‌ఐఆర్‌లలో ఆ నంబర్ ఉన్నట్టు బయటపడింది. 2025లో 68 కేసులు నమోదయ్యాయి. వీటిలో 19 కేసులు కూచ్ బెహార్ జిల్లాలో నమోదయ్యాయి. 2025లోని 68 కేసుల్లో ఈ జంట రూ.48,15,000 మోసానికి పాల్పడింది.

పోలీసు రికార్డుల ప్రకారం ఈ దంపతులపై ఉత్తరప్రదేశ్‌లో 183 కేసులు, రాజస్థాన్‌లో 107 కేసులు, తెలంగాణలో 77 కేసులు, మహారాష్ట్రలో 60 కేసులు, ఢిల్లీలో 55 కేసులు, బీహార్‌లో 54 కేసులు, తమిళనాడులో 49 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 43 కేసులతోపాటు వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో 258 కేసులు ఈ జంటపై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Shubhjit Ballav
cyber fraud
Bihar
West Bengal police
online scams
Darbhanga
Riya Halder Ballav
customer service points
BSF outposts
India

More Telugu News