JP Nadda: ఖర్గేపై వ్యాఖ్యలు.. సారీ చెప్పిన జేపీ నడ్డా

JP Nadda Apologizes for Remarks Against Kharge
  • ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ఘటన
  • కాంగ్రెస్ అధ్యక్షుడు మానసిక సమతుల్యత కోల్పోతున్నాడని వ్యాఖ్య
  • క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాల డిమాండ్
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై సభా పక్ష నేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు వాగ్వాదానికి దారితీశాయి. దీంతో అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో సభ కొంతసేపు దద్దరిల్లింది. చివరకి జేపీ నడ్డా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా ఖర్గే దాదాపు గంటసేపు మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఖర్గే ప్రసంగం అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మానసిక సమతుల్యత కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను తొలగించాలని నడ్డా డిమాండ్ చేశారు.

ఖర్గేపై నడ్డా చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విపక్షాలు నిరసన తెలిపాయి. తాను గౌరవించే మంత్రుల్లో నడ్డా ఒకరని, ఆయన వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. దానికి నడ్డా స్పందిస్తూ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణ కూడా చెబుతున్నానని అన్నారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడని, అలాంటి మోదీ పట్ల ఖర్గే తన స్థాయిని మించి అభ్యంతరకరంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
JP Nadda
Mallikarjun Kharge
Rajya Sabha
Operation Sindoor
Parliament
Congress

More Telugu News