Rajnath Singh: ఇలాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు చిన్నచిన్న విషయాలు పట్టించుకోకూడదు: రాజ్ నాథ్ సింగ్
- పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్
- నేడు లోక్ సభలో చర్చ
- ఆపరేషన్ సిందూర్ పై సభకు వివరాలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ ను కాళ్లబేరానికి తీసుకువచ్చిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మే 7న చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారత్ తిరుగులేని విజయం సాధించిందని, ఇంత భారీ ఆపరేషన్ చేపట్టినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని అన్నారు. భారత సైన్యం ఘనతలను విపక్షాలు తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఉధంపూర్, భుజ్ సైనిక స్థావరాలకు వెళ్లి తాను ప్రత్యక్షంగా చూశానని, కానీ విపక్షాలు మన సైనిక సత్తాను ప్రశ్నిస్తుండడం బాధాకరమని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
రాజ్ నాథ్ వ్యాఖ్యల ముఖ్యాంశాలు
రాజ్ నాథ్ వ్యాఖ్యల ముఖ్యాంశాలు
- ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. పాక్ లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ నిర్వహించాం.
- పీఓకే, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను హతమార్చాం. 7 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
- ఆపరేషన్ సిందూర్ కేవలం 22 నిమిషాల్లోనే ముగిసింది.
- కానీ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం మనపై ప్రతీకార దాడులకు దిగింది. దాంతో మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. పాక్ అస్త్రాలను మన రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుని, తిప్పికొట్టాయి.
- మన దాడుల్లో పాక్ గడ్డపై ఓ మిస్సైల్ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైంది.
- మన వాయుసేన పరాక్రమంతో పాక్ వణికిపోయింది. త్రివిధ దళాలు సమన్వయంతో సాగించిన దాడులకు పాక్ వద్ద సమాధానం లేకపోయింది. దాంతో కాళ్లబేరానికి వచ్చింది.
- ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు పాల్గొన్నారు. అదీ పాక్ చరిత్ర. ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందనడానికి అదే బలమైన నిదర్శనం.
- 1999లో శాంతిని కోరుతూ అటల్ బిహారీ వాజ్ పేయి లాహోర్ యాత్ర చేపట్టారు. కానీ ఆనాడు వాజ్ పేయి కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే పాకిస్థాన్ ఆ మర్నాటి సూర్యోదయం చూసేది కాదు.