పైరసీకి పాల్పడితే మూడేళ్ల‌ జైలు.. భారీ జ‌రిమానా!

  • పైర‌సీ ర‌క్క‌సిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు
  • ప్రస్తుతం ఉన్న సినిమాటోగ్రఫీ చట్టంలో స‌వ‌ర‌ణ‌
  • పైరసీకి పాల్పడితే మూడేళ్ల‌ జైలు, ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం ఫైన్‌
చలనచిత్ర పరిశ్రమను ప‌ట్టిపీడిస్తున్న పైర‌సీ ర‌క్క‌సిని అరికట్టేందుకు కేంద్రం చర్యలకు ఉప‌క్ర‌మించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించింది. ఇక‌పై అక్రమంగా, అనధికారికంగా చిత్రాన్ని రికార్డు చేసినా, ప్రసారం చేసినా మూడేళ్ల‌ జైలు శిక్షతో పాటు ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానాను విధిస్తారు. 

సినిమాల‌ పైరసీని నిరోధించేందుకు నిబంధలను కఠినతరం చేయడానికి రెండేళ్ల‌ క్రితం సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం మార్పులు తెచ్చింది. ఆ సవరణల ప్రకారం పైరసీకి కనీసం మూడు నెలల జైలు శిక్షతో పాటు 3లక్షల జరిమానా విధిస్తారు. 

అయితే, సవరించిన చట్టం ప్రకారం దీనిని మూడేళ్ల‌ వరకు పొడిగింపు లేదా మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానాగా విధించవచ్చునని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్‌ పార్లమెంట్‌కు తెలియ‌జేశారు. అలాగే పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమకు 2023లో ఏకంగా రూ. 22,400 కోట్ల మేర‌ నష్టం వాటిల్లిందని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News