Sajjala Ramakrishna Reddy: ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో కూడా సక్సెస్ చేద్దాం: సజ్జల

Sajjala Calls for Success of Babu Surety Program at Village Level
  • మన వాణిని బలంగా వినిపిద్దామన్న సజ్జల
  • బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇక గ్రామ స్థాయిలోనూ నిర్వహించాలన్న సజ్జల
  • ఆగస్టు నెలాఖరు నాటికి గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్న సజ్జల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభించిన "బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ" కార్యక్రమానికి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆయన నగర, మునిసిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరు నాటికి గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. మండల స్థాయి నాయకులు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. సమష్టిగా, సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు.

వైసీపీ పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేసి చక్కటి పాలన అందించడం జరిగిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుందని విమర్శించారు. జగన్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారని సజ్జల పేర్కొన్నారు.

కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిపై సోషల్ మీడియాను పార్టీ శ్రేణులు ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపించి ప్రజలను చైతన్య పరచాలని సజ్జల పిలుపునిచ్చారు. 
Sajjala Ramakrishna Reddy
YSRCP
YS Jaganmohan Reddy
Babu Surety Mosam Guarantee
Andhra Pradesh Politics
Telugu Desam Party
Coalition Government
Village Level Committees
Social Media Campaign
Welfare Schemes

More Telugu News