India vs England: నాలుగో టెస్టు.. టీమిండియాను నిల‌బెట్టిన రాహుల్‌, గిల్ వీరోచిత పోరాటం!

Gill and Rahul lead Indias fightback with unbeaten fifties
  • మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌, భార‌త్ నాలుగో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు ఏకంగా 311 పరుగుల ఆధిక్యం
  • నాలుగో రోజు ఆట ముగిసే స‌రికి 2 వికెట్ల నష్టానికి 174 ర‌న్స్‌ చేసిన భార‌త్‌
  • ఇంకా 137 ప‌రుగులు వెనుకబడి ఉన్న టీమిండియా
  • మూడో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించిన రాహుల్‌, గిల్‌
మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు ఏకంగా 311 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న భార‌త జ‌ట్టు.. నాలుగో రోజు ఆట ముగిసే స‌రికి 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంకా 137 ప‌రుగులు వెనుకబడి ఉంది.

సున్నాకే రెండు వికెట్లు పడ్డ దశలో సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ( 87 నాటౌట్‌) మరో కీలక ఇన్నింగ్స్‌తో తన విలువను చాటుకోగా నాలుగో స్థానంలో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ (78 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు ఈ ద్వ‌యం ఇప్పటికే అజేయంగా 174 పరుగులు జోడించింది. 

ఇంగ్లండ్‌ బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తూ ఈ జోడీ క్రీజులో కుదురుకునేదాకా పూర్తిగా డిఫెన్స్‌నే న‌మ్ముకుంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పేసర్లు పదే పదే కవ్వించే బంతులేసినా వాటి జోలికి పోకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించారు. అడపాదడపా గిల్‌ బౌండరీలతో అలరించినా రాహుల్‌ మాత్రం ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

నిల‌బ‌డి.. ఆశ‌లు నిలిపారు
రెండో సెషన్ టీ విరామం తర్వాత 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డాసన్‌ క్యాచ్‌ జారవిడవడంతో గిల్‌కు ఒక లైఫ్ దొరికింది. ఈ క్ర‌మంలో తన కెరీర్‌లో 8వ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. టీ విరామం తర్వాత రాహుల్‌ కూడా 140 బంతుల్లో అర్ధ శ‌త‌కం సాధించాడు. రెండో సెషన్‌ 26 ఓవర్లు ఆడి 85 రన్స్‌ జోడించిన ఈ ద్వయం.. మూడో సెషన్‌లోనూ అదే పట్టుదలను ప్రదర్శించింది. 

స్పిన్నర్‌ డాసన్‌ కొంత ఇబ్బందిపెట్టినా రాహుల్‌, గిల్‌ పట్టు విడవకుండా ఆడి మరో వికెట్‌ పడకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. దాంతో నాలుగో రోజు ఆట ముగిసే స‌రికి టీమిండియా 63 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంకా 137 ర‌న్స్‌ వెనుకబడి ఉంది. ఐదో రోజు ఈ జోడీ ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలి. ఆ త‌ర్వాత వ‌చ్చే బ్యాట‌ర్లు కూడా క్రీజులో నిల‌బ‌డితేనే భార‌త్ మ్యాచ్‌ను డ్రా చేసుకోగ‌ల‌దు.  

సంక్షిప్త స్కోర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 358 ఆలౌట్‌
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 669 ఆలౌట్‌ (రూట్‌ 150, స్టోక్స్‌ 141, జడేజా 4/143, సుందర్‌ 2/107)
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 63 ఓవర్లలో 174/2 (రాహుల్ 87 నాటౌట్‌, గిల్ 78 నాటౌట్‌, వోక్స్‌ 2/48)
India vs England
KL Rahul
KL Rahul batting
Shubman Gill
India batting
Manchester Test
Cricket
India England Test
Cricket scores
Rahul Gill partnership

More Telugu News