బుమ్రా ఇక రిటైర్ అవుతాడేమో!: మహ్మద్ కైఫ్

  • గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న బుమ్రా
  • బుమ్రాకు శరీరం సహకరించడంలేదన్న కైఫ్
  • రాబోయే టెస్టు సిరీస్ ల్లో బుమ్రా కనిపించకపోవచ్చని వెల్లడి
భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు శరీరం సహకరిస్తున్నట్టుగా లేదని, దాంతో అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని అన్నాడు.,ఇది అతని టెస్ట్ క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చని కైఫ్ పేర్కొన్నాడు. 

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు, భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బుమ్రా ఐదు టెస్టుల్లో కేవలం మూడింటిలో మాత్రమే ఆడతాడని చెప్పడం తెలిసిందే. బుమ్రాపై పనిభారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మాజీ క్రికెటర్ల అభిప్రాయం ప్రకారం, బుమ్రా బౌలింగ్ వేగంలో తగ్గుదల, అతను ఎదుర్కొంటున్న శారీరక ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి.

మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ, "బుమ్రా తన శరీరంతో తీవ్రంగా పోరాడుతున్నాడు. అతని శరీరం పూర్తిగా సహకరించడం లేదు. అతను 100 శాతం ఇవ్వలేకపోతే, స్వచ్ఛందంగా టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రాబోయే టెస్టు సిరీస్ ల్లో టీమిండియాలో బుమ్రా కనిపించకపోవచ్చు" అని వ్యాఖ్యానించాడు.

బుమ్రా గత కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. అద్భుతమైన ప్రదర్శనలతో భారత జట్టుకు కీలక బౌలర్‌గా నిలిచినప్పటికీ, గాయాలు వేధిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చినప్పటికీ, ఓవరాల్ గా అతడి ప్రదర్శనపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుమ్రా ఈ శారీరక సవాళ్లను ఎలా అధిగమిస్తాడు? అతని టెస్ట్ కెరీర్ భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


More Telugu News