Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ పగటి కలలు కంటున్నారు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy criticizes KTRs daydreams
  • 200 మంది చెంచాలను వెంట బెట్టుకొని డ్రాములు చేస్తున్నారని విమర్శ
  • పాలన విషయంలో ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
  • బీఆర్ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారం విఫలం కావడం కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని వ్యాఖ్య
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 200 మంది చెంచాలను వెంటబెట్టుకొని డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్‌కు అధికారం దూరమై పద్దెనిమిది నెలలే అవుతోందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పాలన విషయంలో ప్రజల మనసుల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ నాయకులు రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యతిరేక ప్రచారం విఫలం కావడాన్ని కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతోందని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగడం లేదని చెబుతూ, తాము వచ్చాక ఏదో చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చచ్చిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనే పిచ్చి భ్రమలో ఉండి, పదవి పోయాక ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు.

2014, 2018లలో బీఆర్ఎస్ ఇచ్చిన 70 హామీలను నెరవేర్చలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ తప్ప ఎవరూ ట్యాప్ చేయడం లేదని విమర్శించారు. మొన్నటి వరకు మా పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరి ఎక్కువ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా బీఆర్ఎస్ నేతలు ఫేమస్ కావాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Chamala Kiran Kumar Reddy
KTR
BRS
Revanth Reddy
Telangana Congress

More Telugu News