హెచ్ఐవీ సోకిన బాలికనూ వదలని కామాంధుడు.. మహారాష్ట్రలో అమానవీయ ఘటన

  • పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన బాలిక
  • లాథూర్ జిల్లాలోని హెచ్ఐవీ బాధితుల ఆశ్రమంలో ఘటన
  • బాలికపై ఆశ్రమంలో పనిచేసే ఉద్యోగి అఘాయిత్యం
మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాలో అత్యంత హేయమైన సంఘటన వెలుగుచూసింది. హెచ్ఐవీ సోకిన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. రెండేళ్లలో పలుమార్లు అఘాయిత్యం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. లాథూర్ జిల్లాలోని హెచ్ఐవీ బాధితుల ఆశ్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమ ఉద్యోగి చేసిన ఈ నిర్వాకంపై బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ధారశివ్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక హెచ్‌ఐవీ సోకడంతో లాథుర్‌ జిల్లాలోని బాలికల ఆశ్రమంలో ఉంటోంది. రెండేళ్లుగా అక్కడే ఉంటున్న బాలికపై ఆశ్రమ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఇలాగే బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యం చేశాడు. ఉద్యోగి నిర్వాకాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు బాలిక విఫలయత్నం చేసింది. ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. ఆశ్రమం నిర్వాహకులు వాటిని చించివేశారని ఆరోపించింది.

ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలింది. దీంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడిన ఆశ్రమ ఉద్యోగి.. వైద్యుడిని ప్రలోభపెట్టి బాలికకు అబార్షన్ చేయించాడు. విషయం గ్రహించిన బాలిక ధోకీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు లాథుర్‌ జిల్లా ఎస్పీ అమోల్‌ తాంబే తెలిపారు.


More Telugu News