Southwest Airlines: ఆకాశంలో రెండు విమానాలు ఒకే ఎత్తులో ఎదురెదురుగా.. పెను ప్రమాదాన్ని నివారించిన పైలట్

Southwest Airlines Pilot Averts Mid Air Collision
  • కాలిఫోర్నియా నుంచి లాస్ వెగాస్‌కు బయలుదేరిన విమానం 
  • విమానం 14,100 అడుగుల ఎత్తులో అదే ఎత్తులో వస్తున్న ఫైటర్ జెట్
  • రెండు విమానాల మధ్య దూరం 7 కిలోమీటర్లు మాత్రమే
  • వెంటనే విమానాన్ని 475 అడుగుల కిందికి దించి ప్రమాదాన్ని నివారించిన పైలట్
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ విమానం 1496  త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కాలిఫోర్నియాలోని హాలీవుడ్ బర్బాంక్ ఎయిర్‌పోర్ట్ నుంచి లాస్ వెగాస్‌కు బయలుదేరిన విమానం కొద్దిసేపటికే నింగిలో మరో విమానాన్ని ఢీకొట్టబోయింది. ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే 475 అడుగులు (145 మీటర్లు) కిందికి దించాడు. ఈ ఘటనలో ఇద్దరు విమాన సిబ్బంది గాయపడినప్పటికీ పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) రెండు హెచ్చరికలు జారీ చేయడంతో పైలట్ మొదట విమానాన్ని పైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అంతే వేగంగా కిందికి దించినట్టు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
 
విమానం ఆకస్మికంగా కిందికి దిగడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రయాణికులు తమ సీట్ల నుంచి గాలిలోకి లేచారు. కొందరు క్యాబిన్ పైకప్పుకు తాకి గాయపడ్డారు. "దాదాపు 20-30 అడుగులు ఫ్రీఫాల్‌లా అనిపించింది. అందరూ భయంతో కేకలు వేశారు, విమానం కూలిపోతుందని అనుకున్నాం" అని ప్రయాణికురాలు కైట్లిన్ బర్డి ‘ఫాక్స్ న్యూస్‌’తో తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

విమానంలో ఉన్న కమెడియన్ జిమ్మీ డోర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘‘పైలట్ కాక్‌పిట్‌లో కొలిషన్ హెచ్చరిక వచ్చిందని, మరో విమానాన్ని ఢీకొట్టే ప్రమాదాన్ని నివారించేందుకు ఆకస్మికంగా విమానం ఎత్తు తగ్గించినట్టు చెప్పాడు. నా తల సీలింగ్‌కు తగిలింది’’ అని పేర్కొన్నాడు.

సౌత్‌వెస్ట్ విమానాన్ని ఢీకొట్టబోయిన మరో విమానం హాకర్ హంటర్ (ఎన్335ఏఎక్స్) అనే బ్రిటిష్ ఫైటర్ జెట్. ఈ హాకర్ హంటర్ దాదాపు 14,653 అడుగుల ఎత్తులో ఉండగా, సౌత్‌వెస్ట్ విమానం 14,100 అడుగుల ఎత్తులో ఉంది. హెచ్చరిక అనంతరం విమానాన్ని ఒక్కసారిగా 13,625 అడుగులకు దించాడు. ఆ సమయంలో రెండు విమానాల మధ్య దూరం సమాంతరంగా 4.86 మైళ్లు (7.82 కి.మీ.) మాత్రమే.   
పెను ప్రమాదాన్ని తప్పించిన పైలట్లు, విమాన సిబ్బందిపై సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రశంసలు కురిపించింది. ప్రయాణికులు, ఉద్యోగుల భద్రత కంటే సౌత్‌వెస్ట్‌కు ముఖ్యమైనది మరేదీ లేదని పేర్కొంది. ఈ ఘటన అనంతరం విమానం లాస్ వెగాస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Southwest Airlines
Southwest Airlines flight 1496
near miss collision
Hollywood Burbank Airport
Hawker Hunter N335AX
plane accident avoidance
pilot saves plane
Traffic Collision Avoidance System
TCAS
Jimmy Dore

More Telugu News