టీమిండియా చెత్త బౌలింగ్.. గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి!

  • మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌, భార‌త్‌ నాలుగో టెస్ట్‌
  • దారుణంగా విఫల‌మైన టీమిండియా బౌల‌ర్లు
  • ఓవర్‌సీస్‌లో గత 10 ఏళ్లలో తొలిసారి 500+ ర‌న్స్‌ స‌మ‌ర్పించుకుని భార‌త్‌ చెత్త రికార్డ్‌
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భార‌త జ‌ట్టు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరాశపరిచారు. ముఖ్యంగా టీమిండియా పేసర్లు తేలిపోయారు. స్టార్ పేసర్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇలా ముకుమ్మ‌డిగా విఫలం కావ‌డం గ‌మ‌నార్హం. 

వికెట్లు తీయడం అటుంచితే.. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ బ్యాటింగ్ దాటికి టీమిండియా బౌల‌ర్ల వ‌ద్ద స‌మాధానం లేకుండాపోయింది. ధారళంగా పరుగులు స‌మ‌ర్పించుకున్నారు. దాంతో భార‌త జ‌ట్టు చెత్త రికార్డ్ నమోదు చేసింది. ఓవర్‌సీస్‌లో గత 10 ఏళ్లలో తొలిసారి 500కు పైగా ప‌రుగులు సమర్పించుకుంది.

2015లో చివరిసారిగా టీమిండియా ఓవర్‌సీస్ కండిషన్స్‌లో 500+ రన్స్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 572 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఎప్పుడూ 500కు పైగా ప‌రుగులు  ఇవ్వ‌లేదు. తాజా మ్యాచ్‌లోనే 500+ రన్స్ ఇచ్చుకొని చెత్త రికార్డ్‌ నమోదు చేసింది.

ఇక‌, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ త‌లో రెండు వికెట్లు పడ‌గొట్ట‌గా.. సిరాజ్, బమ్రా, కంబోజ్ చెరో వికెట్ తీశారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 186 పరుగుల‌కు చేరింది. అంతుకుముందు భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.


More Telugu News