రఘునందన్ రావు ఆ విషయంలో ఎందుకు ఒత్తిడి చేయడం లేదు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావొద్దని రఘునందన్ రావు కోరుకుంటున్నారని విమర్శ
  • బిల్లుకు ఆమోదం తెలపకుండా బీజేపీ నేతలు అనవసర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బిల్లు తీసుకు వచ్చారన్న ఆది శ్రీనివాస్
బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్ఠానాన్ని ఎంపీ రఘునందన్ రావు ఎందుకు ఒత్తిడి చేయటం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకూడదని రఘునందన్ రావు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

తమ పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ అని పేర్కొన్న ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మీ అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వారికి అన్ని అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావు పాఠాలు చెప్పవలసిన అవసరం లేదని ఆది శ్రీనివాస్ అన్నారు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ వల్ల కాకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసుకుంటామని ఆది శ్రీనివాస్ అన్నారు.


More Telugu News