Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష.. డ్రోన్ మిసైల్ టెస్ట్

Kurnool Drone Missile Test Rajnath Singh Shares Details
  • ఎక్స్ లో వెల్లడించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
  • డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న ఫొటోను పంచుకున్న మంత్రి
  • డీఆర్‌డీవోతో పాటు క్షిపణి తయారీ సంస్థలకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో రక్షణ శాఖ కీలక ప్రయోగ పరీక్షను నిర్వహించింది. జిల్లాలోని నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజి (ఎన్‌ఓఏఆర్‌) లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. డ్రోన్ సాయంతో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిసైల్‌ (యూఎల్‌పీజీఎం)-వీ3 గా వ్యవహరిస్తున్నారు. ఈ క్షిపణిని తయారుచేసిన రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో)తో పాటు ఇందుకు సాయం చేసిన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్ లను మంత్రి అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతోపాటు.. ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్‌కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు.

ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌ వ్యవస్థను పరీక్షించారు. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో డీఆర్‌డీవో అధీనంలో ఉన్న అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ రేంజ్ ను 2016-17లో ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత్‌ డ్రోన్‌ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది.
Kurnool
DRDO
Drone missile test
Rajnath Singh
ULPGM-V3
National Open Area Range
NOAR
Defense Research and Development Organisation
Andhra Pradesh
Missile technology

More Telugu News