Ministry of Information and Broadcasting: అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 25 యాప్‌లపై కేంద్రం కొరడా

25 OTT Platforms Including Ullu ALT Banned for Obscene Content
  • అశ్లీల, చట్ట విరుద్ధ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపణలు
  • ఉల్లు, ఆల్ట్, దేశీ ఫ్లిక్స్ సహా పలు యాప్‌లపై నిషేధం
  • కంటెంట్ కంటే లైంగిక దృశ్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యాప్‌లు
అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఉల్లు, ఆల్ట్, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ సహా 25 ఓటీటీ (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫామ్‌లు, వెబ్‌సైట్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇవి పలు భారతీయ చట్టాలను, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 (సెక్షన్ 67 మరియు 67ఎ), భారతీయ న్యాయ సంహిత, 2023 (సెక్షన్ 294), మహిళల అసభ్యకరమైన చిత్రణ (నిషేధం) చట్టం, 1986 (సెక్షన్ 4) వంటి పలు భారతీయ చట్టాలను ఉల్లంఘించాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) గుర్తించింది.

నిషేధిత యాప్‌లు, వెబ్‌సైట్లు ఇవే
నిషేధించిన 25 యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఉల్లు, ఆల్ట్, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫెనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్చల్ యాప్, మూడ్ ఎక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫ్యూజీ, మోజీఫ్లిక్స్, ట్రైఫ్లిక్స్ వంటివి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు అశ్లీల కంటెంట్‌ను ప్రదర్శించడం ద్వారా సమాజంలోని నైతికత, పబ్లిక్ ఆర్డర్‌ను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

నిషేధానికి ప్రధాన కారణాలు
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లు అశ్లీల, లైంగికంగా స్పష్టమైన కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నాయి. ఇది భారత చట్టాలకు విరుద్ధం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) సమర్పించిన 90 పేజీల నివేదికలో, ఈ ప్లాట్‌ఫామ్‌లు కథాంశం లేకుండా, కేవలం లైంగిక దృశ్యాల కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నట్టు వివరంగా పేర్కొంది. 

ఆల్ట్‌లో ‘కతిల్ హసీనా’ (సీజన్ 1, ఎపిసోడ్ 1)లో 22 నిమిషాల రన్‌టైమ్‌లో 5 నిమిషాలు లైంగిక కంటెంట్‌కు కేటాయించింది. ఉల్లులోని ‘బదన్’ (ఎపిసోడ్ 11)లో 21 నిమిషాల రన్‌టైమ్‌లో 19 నిమిషాలు లైంగిక దృశ్యాలతో నిండి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈ కంటెంట్‌లు ‘సాంస్కృతిక లేదా విద్యాపరమైన విలువ లేకుండా, కేవలం ప్రేక్షకుల లైంగిక ఆసక్తిని రేకెత్తించడానికి’ రూపొందించబడినవని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని నీతి నియమావళిని కూడా ఉల్లంఘించాయని పేర్కొంది. కాగా, 2024 మార్చిలోనూ ఎంఐబీ 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అశ్లీల, అసభ్య కంటెంట్ కారణంగా నిషేధించింది. ఇందులో డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యెస్మా, హాట్ షాట్స్ వీఐపీ వంటివి ఉన్నాయి.   
Ministry of Information and Broadcasting
OTT platforms ban
Ullu app
ALT app
DesiFlix
pornography ban India
illegal content
IT Act 2000
Indian Penal Code
online streaming

More Telugu News