వీడు మామూలోడు కాదు.. నకిలీ ఎంబసీనే కాదు.. ఈస్టిండియా కంపెనీని కూడా స్థాపించేశాడు!

  • ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని స్థాపించిన హర్షవర్ధన్ జైన్
  • స్వయం ప్రకటిత మైక్రోనేషన్‌ల రాయబారిగా చలామణి
  • దర్యాప్తులో జైన్ నేర సామ్రాజ్యం వెలుగులోకి
  • పలు దేశాల్లో షెల్ కంపెనీ స్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని నడిపిన కేసులో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ అంతర్జాతీయ ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను వెలుగులోకి తెచ్చారు. లడోనియా, వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్వియా వంటి స్వయం ప్రకటిత మైక్రోనేషన్‌ల రాయబారిగా జైన్ చలామణి అయ్యేవాడు.

 జైన్.. యూకే, మారిషస్, దుబాయ్, పలు ఆఫ్రికన్ దేశాలలో అనేక షెల్ కంపెనీలను స్థాపించినట్టు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారులు గుర్తించారు. అతడి పేరుతో నమోదైన సంస్థలలో.. ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఐలాండ్ జనరల్ ట్రేడింగ్ కో ఎల్‌ఎల్‌సీ (దుబాయ్), ఇందిరా ఓవర్సీస్ లిమిటెడ్ (మారిషస్), కామెరూన్ ఇస్పాట్ సార్ల్ (ఆఫ్రికా) వంటివి ఉన్నాయి. ఈ కంపెనీలు పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా కార్యకలాపాలు, వివిధ మోసపూరిత పథకాలలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గురువు చంద్రస్వామి సన్నిహితుడితో సంబంధాలు
వివాదాస్పద స్వయం ప్రకటిత గురువు చంద్రస్వామి సన్నిహిత సహచరుడైన ఎహసాన్ అలీ సయ్యద్ సూచనల మేరకు తాను పనిచేసినట్టు జైన్ ఒప్పుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఎహసాన్ ప్రస్తుతం టర్కిష్ పౌరసత్వం కలిగి లండన్‌లో నివసిస్తున్నాడు. జైన్‌కు ఈ షెల్ కంపెనీలను స్థాపించడంలో ఎహసాన్ కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ఎస్‌టీఎఫ్ దర్యాప్తు ప్రకారం.. 2008 నుంచి 2011 మధ్యకాలంలో ఎహసాన్, అతడి సిండికేట్ సుమారు 70 మిలియన్ పౌండ్ల నకిలీ రుణాలను సేకరించింది. ఆ తర్వాత సుమారు 25 మిలియన్ పౌండ్లు కమీషన్‌గా వసూలు చేసి పరారయ్యారు.

2022లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు లండన్ పోలీసులు ఎహసాన్‌ను అరెస్ట్ చేశారు. 2023లో లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అతడిని స్విట్జర్లాండ్‌కు అప్పగించడానికి అనుమతించింది. ఎహసాన్  విస్తృత అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లో హర్షవర్ధన్ జైన్ కచ్చితమైన పాత్ర, బాధ్యతను ఎస్‌టీఎఫ్ లోతుగా పరిశీలిస్తోంది. 


More Telugu News