Oman: మ‌స్క‌ట్‌లో దిక్కుతోచ‌ని స్థితిలో తెలుగు యువ‌తి .. వీడియో ద్వారా గోడు వెళ్ల‌బోసుకున్న బాధితురాలు

Telugu Woman Trapped in Muscat Seeks Help to Return Home
  • మ‌హిళా ఏజెంట్ మాయ‌మాట‌లు న‌మ్మి ప‌రాయి దేశం వెళ్లిన యువ‌తి
  • అక్క‌డ అనారోగ్యం బారినప‌డి స్వ‌దేశానికి వ‌చ్చేందుకు సాయం కోరుతున్న బాధితురాలు
  • స్నేహితుల‌కు పంపిన సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఘ‌ట‌న‌
మ‌హిళా ఏజెంట్ మోస‌పూరిత మాట‌లతో దేశం కాని దేశం వెళ్లి అనారోగ్యం బారిన ప‌డ్డ ఓ తెలుగు యువ‌తి దిక్క‌తోచ‌ని స్థితిలో స్వ‌దేశానికి వ‌చ్చేందుకు సాయం కోసం ఎదురుచూస్తోంది. అక్క‌డ తాను ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఓ వీడియో ద్వారా స్నేహితుల‌కు తెలియ‌జేసింది. ఎలాగైనా త‌న‌ను ఒమ‌న్ నుంచి ఇండియాకు తీసుకెళ్లాల‌ని ఆమె వీడియోలో క‌న్నీరుమున్నీరు అయింది. 

వివ‌రాల్లోకి వెళితే... భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేట ప‌ట్ట‌ణం గౌడ బ‌జారుకు చెందిన కోయ మేరీ భ‌ర్త‌ రెండేళ్ల కింద చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత ఆమె అనారోగ్యం పాలైంది. డిగ్రీ చ‌దివిన ఆమె కుమార్తె కావ్య (22) దుకాణాల్లో ప‌నిచేస్తూ త‌ల్లిని పోషించేది. 

ఈ క్ర‌మంలో వీరి ఆర్థిక ఇబ్బందుల‌ను గ‌మ‌నించిన తూర్పుగోదావరి జిల్లా తాళ్ల‌పూడికి చెందిన ఓ మ‌హిళా ఏజెంటు కావ్య‌కు మాయ‌మాట‌లు చెప్పి ఒమ‌న్ దేశంలోని మ‌స్క‌ట్‌లో ఒక ధ‌న‌వంతుడి ఇంట్లో ప‌నిచేస్తే నెల‌కు రూ. 30వేల నుంచి రూ. 40వేలు జీతంతో పాటు వ‌స‌తి క‌ల్పిస్తార‌ని న‌మ్మించింది. 

కావ్య అక్క‌డికి వెళ్లేందుకు అయ్యే రూ. 3లక్ష‌ల ఖ‌ర్చు తానే భ‌రిస్తాన‌ని చెప్పింది. అలా త‌ల్లీకూతురును మోస‌పూరిత మాట‌ల‌తో న‌మ్మించి మూడు నెల‌ల కింద కావ్య‌ను మ‌స్క‌ట్ పంపించింది. అయితే, అక్క‌డ అనారోగ్యం పాలైన కావ్య చావు బతుకుల్లో ఉన్న‌ట్లు, త‌న‌ను స్వ‌దేశానికి తీసుకెళ్లేందుకు స‌హ‌క‌రించాల‌ని స్నేహితుల‌కు పంపించిన సెల్ఫీ వీడియోలో క‌న్నీటిప‌ర్యంత‌మైంది. 

దీంతో త‌న కూతురిని తిరిగి స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కావ్య త‌ల్లి మేరీ వేడుకుంటోంది. అయితే, త‌మ‌కు ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని అశ్వ‌రావుపేట ఎస్ఐ య‌యాతి రాజు తెలిపారు. బాధితులు ఏపీ నుంచి కొన్నేళ్ల క్రితం ఇక్క‌డికి వ‌ల‌స‌రావ‌డంతో పాటు తాళ్ల‌పూడి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింద‌న్నారు.   
Oman
Koya Mary
Telugu girl
Muscat
stranded
financial problems
woman agent
Ashwaraopeta
Bhadradri Kothagudem
repatriation

More Telugu News