అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత 112 మంది పైలట్ల సిక్‌లీవ్

  • ప్రమాదం జరిగిన తర్వాత ఎయిరిండియాలో సిక్‌లీవ్‌లు పెరిగాయన్న కేంద్రం
  • నాలుగు రోజుల వ్యవధిలో 112 మంది సిక్‌లీవులు తీసుకున్నట్లు వెల్లడి
  • పార్లమెంటుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన అనంతరం ఆ సంస్థకు చెందిన 100 మందికి పైగా పైలట్లు సిక్‌లీవ్ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. గత నెల 12వ తేదీన ప్రమాదం సంభవించిన తర్వాత ఎయిరిండియాలో సిక్ లీవ్‌ల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. నాలుగు రోజుల వ్యవధిలో సెలవులు తీసుకున్న వారి సంఖ్య 112కు చేరుకుందని వెల్లడించింది.

సిక్ లీవ్ తీసుకున్న వారిలో 51 మంది కెప్టెన్లు (పైలట్ ఇన్ కమాండ్), 61 మంది పైలట్లు (ఫస్ట్ ఆఫీసర్లు) ఉన్నారని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ లోక్‌సభకు తెలియజేశారు. 2023లో విమానయాన సంస్థలకు జారీ చేసిన నోటీసుల గురించి కూడా ఆయన లోక్‌సభకు వివరించారు.

సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహించే సమయంలో మానసిక ఆరోగ్యాన్ని త్వరితగతిన అంచనా వేయడానికి అవసరమైన పద్ధతులు ఉండాలని ఆ నోటీసులలో పేర్కొన్నట్లు తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు విమానయాన సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్లకు సహాయం చేయడానికి పీర్ సపోర్టు గ్రూపులను ఏర్పాటు చేయాలని ఆ సమయంలో సూచించినట్లు ఆయన తెలియజేశారు.


More Telugu News