నటుడు ఆండ్రీ ప్రెటీని పెళ్లాడనున్న టెన్సిస్ స్టార్ వీనస్ విలియమ్స్

  • వాషింగ్టన్ ఓపెన్‌లో గెలిచి చరిత్ర సృష్టించిన వీనస్ 
  • డబ్ల్యూటీఏ టూర్-స్థాయి సింగిల్స్ మ్యాచ్ గెలిచిన రెండవ అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా రికార్డు
  • విజయం తర్వాత ప్రెటీతో నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించిన వీనస్
టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ (45) క్రీడా రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ సంచలనం సృష్టించింది. వాషింగ్టన్ ఓపెన్ 2025లో ఈ నెల 22న జరిగిన సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో పేటన్ స్టెర్న్స్‌పై 6-3, 6-4 తేడాతో అద్భుత విజయం సాధించిన ఆమె.. ఆ వెంటనే నటుడు ఆండ్రియా ప్రెటి (37)తో తన నిశ్చితార్థం జరిగినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ విజయంతో, 45 సంవత్సరాల 34 రోజుల వయస్సులో వీనస్, డబ్ల్యూటీఏ టూర్-స్థాయి సింగిల్స్ మ్యాచ్ గెలిచిన రెండవ అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా (45 సంవత్సరాల 242 రోజులు) అగ్రస్థానంలో ఉన్నారు.

మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం రెన్నే స్టబ్స్ వీనస్‌ను నిశ్చితార్థం గురించి అడిగినప్పుడు ఆమె చిరునవ్వుతో స్పందించింది. "అవును, నా ఫియాన్సే ఇక్కడ ఉన్నాడు. అతను నన్ను ఆట కొనసాగించమని చాలా ప్రోత్సహించాడు" అని వీనస్ తెలిపింది. "చాలాసార్లు నేను విశ్రాంతి తీసుకోవాలని, సరదాగా ఉండాలని అనుకున్నాను. టెన్నిస్ ఆడటం ఎంత కష్టమో మీకు తెలుసు కదా? ఇది 9 నుంచి 5 వరకు చేసే ఉద్యోగం లాంటిది కాదు. నీవు నిరంతరం పరుగెత్తాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, చాలా కష్టపడాలి. మరుసటి రోజు మళ్లీ అదే పునరావృతం చేయాలి. అతడు నన్ను ఈ కష్టాలను దాటి వెళ్లేలా ప్రోత్సహించాడు. ఇప్పుడు ఇక్కడ ఉండటం గొప్పగా ఉంది. నేడు ఆడటం అతడు మొదటిసారి చూశాడు" అని ఆమె ఆనందంగా వెల్లడించింది.

ఆండ్రియా ప్రెటి ఎవరు?
ఆండ్రియా ప్రెటి 1988లో డెన్మార్క్‌లో జన్మించి, ఇటలీలో పెరిగిన 37 ఏళ్ల నటుడు, మాజీ మోడల్. న్యూయార్క్‌లోని సుసాన్ బాట్సన్ అకాడమీలో నటన నేర్చుకున్న ఆయన ‘వన్ మోర్ డే’(2014)సినిమాతో రచయిత, దర్శకుడు, నటుడిగా గుర్తింపు పొందాడు. ఇటాలియన్ టీవీ సిరీస్ ‘ఎ ప్రొఫెసర్’, ‘టెంప్టేషన్’(2023) వంటి చిత్రాల్లో కూడా నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీనస్ తన ఎడమ చేతికి డైమండ్ రింగ్ ధరించడంతో నిశ్చితార్థం గురించి పుకార్లు షికారు చేశాయి.

టెన్నిస్‌లో చారిత్రక విజయం.. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం
16 నెలల విరామం తర్వాత వాషింగ్టన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన వీనస్ సింగిల్స్‌లో 2023 సిన్సినాటి మాస్టర్స్ తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ఆమెను 45 ఏళ్ల వయస్సులో డబ్ల్యూటీఏ సింగిల్స్ మ్యాచ్ గెలిచిన రెండవ అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా నిలిపింది. ఏడు గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత అయిన వీనస్, గత ఏడాది గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ తొలగింపు శస్త్రచికిత్స తర్వాత ఈ ఘనత సాధించడం విశేషం. ఆమె ఇప్పుడు రౌండ్ ఆఫ్ 16లో పోలాండ్‌కు చెందిన మాగ్డలీనా ఫ్రెచ్ (వరల్డ్ నంబర్ 24, ఐదవ సీడ్)తో తలపడనుంది. 


More Telugu News