డిజిలాక‌ర్‌లో త‌న సేవ‌లను ప్రారంభించిన ఈపీఎఫ్ఓ

  • ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్‌, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి సేవ‌లు మ‌రింత సుల‌భ‌త‌రం
  • ఇక‌పై డిజిలాక‌ర్‌లోనూ ఖాతాదారులు ఈ సేవ‌ల‌ను పొందే వెసులుబాటు
  • ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వారు డిజిలాక‌ర్ యాప్‌తో ఈ సేవ‌ల‌ను పొందే వీలు
ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిజిలాక‌ర్ యాప్‌లోనూ త‌న సేవ‌లను ప్రారంభించింది. ఇక‌పై డిజిలాక‌ర్‌లోనూ ఉద్యోగులు త‌మ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్క‌డి నుంచైనా పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను యాక్సెస్ చేయొచ్చంటూ ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వారు డిజిలాక‌ర్ యాప్ డౌన్‌లోడ్ చేసి పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అంతేగాక యూఏఎన్ కార్డు, పెన్ష‌న్‌పేమెంట్ ఆర్డ‌ర్‌, స్కీమ్ స‌ర్టిఫికేట్ వంటివి డిజిలాక‌ర్ ద్వారా పొంద‌వ‌చ్చు. కాగా, పాస్‌బుక్ డౌన్‌లోడ్ స‌దుపాయం ఉమాంగ్ యాప్‌లో ఉండేది. ఇక‌పై డిజిలాక‌ర్‌లోనూ పొందే వెసులుబాటు క‌లిగింది. 

ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. త్వ‌ర‌లోనే ఐఓఎస్ యూజ‌ర్ల‌కు కూడా అందుబాటులోకి రానుంది. మ‌రోవైపు ఈపీఎఫ్‌కు సంబంధించిన సేవ‌లు ఉమాంగ్ యాప్‌తో పాటు పీఎఫ్ఓ పోర్ట‌ల్‌లో కూడా ల‌భిస్తాయ‌నే విష‌యం తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాదారులు వారి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 99660 44425 నంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు.    


More Telugu News