అమితాబ్, ఆమిర్ ఖాన్ రోల్స్ రాయిస్ కార్లకు రూ.38 లక్షల జరిమానా!

  • అమితాబ్, ఆమిర్ ఖాన్ గతంలో ఉపయోగించిన కార్లు
  • వాటిని కొనుగోలు చేసిన కేజీఎఫ్ బాబు
  • ఆ కార్లు ఇప్పటికీ అమితాబ్, ఆమిర్ పేరు మీదనే ఉన్న వైనం
  • రోడ్ ట్యాక్స్ కట్టకపోవడంతో భారీ జరిమానా
బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ గతంలో ఉపయోగించిన రెండు రోల్స్ రాయిస్ కార్లకు భారీ జరిమానాలు విధించారు. ఈ కార్లు కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు పన్ను చెల్లించనందుకు రూ. 38 లక్షల కంటే ఎక్కువ జరిమానాకు గురయ్యాయి.

అమితాబ్ బచ్చన్ గతంలో ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు రూ. 18.53 లక్షలు, ఆమిర్ ఖాన్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు రూ. 19.73 లక్షలు జరిమానా విధించారు. ఈ రెండు కార్ల ప్రస్తుత యజమాని యూసుఫ్ షరీఫ్, స్థానిక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 'కేజీఎఫ్ బాబు'గా ప్రసిద్ధి చెందారు.

యూసుఫ్ షరీఫ్ ఈ కార్లను కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ప్రముఖుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ, వాటి యాజమాన్యాన్ని తన పేరు మీదకు ఇంకా బదిలీ చేసుకోలేదు. కేజీఎఫ్ బాబు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) నుండి వచ్చారు. 

ఈ కార్లు మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడినప్పటికీ, రోల్స్ రాయిస్ ఫాంటమ్ 2021 నుంచి, ఘోస్ట్ 2023 నుంచి బెంగళూరులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాహనాలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం స్థానిక రోడ్డు పన్ను చెల్లించకుండా ఉండడం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగా ఈ భారీ జరిమానాలు విధించారు. ఆయా వాహనాల పేపర్లలో పాత యజమానుల పేర్లే ఉన్నాయని ఆర్‌టీఓ అధికారులు ధృవీకరించారు.




More Telugu News