Harshvardhan Jain: ఆ పేరుతో దేశమే లేదు.. భారత్‌లో ఎంబసీ ఏర్పాటు చేసి జాబ్ రాకెట్ నడిపిన వ్యక్తి అరెస్టు

Harshvardhan Jain Arrested for Running Job Racket from Fake Embassy
  • వెస్ట్ఆర్కిటికా పేరుతో జాబ్ రాకెట్ నడుపుతున్న హర్షవర్ధన్ జైన్
  • ఘజియాబాద్‌లో రెండంతస్తుల భవనంలో దౌత్య కార్యాలయం ఏర్పాటు
  • దౌత్య కార్యాలయ ఫొటోలు సామాజిక మాధ్యమాలలో పంచుకున్న జైన్
  • అనుమానం వచ్చి నకిలీ ఎంబసీ గుట్టు రట్టు చేసిన పోలీసులు
భూమిపై లేని (గుర్తింపు) ఒక దేశానికి ఎంబసీని ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు సమీపంలోని ఘజియాబాద్‌లో పోలీసులకు చిక్కాడు. ఘజియాబాద్‌లో ఒక విలాసవంతమైన రెండతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని, వెస్ట్‌ఆర్కిటికా పేరుతో దౌత్య కార్యాలయాన్ని నడుపుతున్నాడు.

వెస్ట్‌ఆర్కిటికా అనేది అంటార్కిటికాలోని ఒక ప్రాంతం. ఒక యూఎస్ నౌకాదళ అధికారి దానిని దేశంగా ప్రకటించుకున్నప్పటికీ, దీనికి ఎలాంటి అంతర్జాతీయ గుర్తింపు లేదు. అక్కడ ఎవరూ నివసించరు. అలాంటి ప్రాంతం పేరుతో హర్షవర్ధన్ జైన్ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను నమ్మించి జాబ్ రాకెట్ నడుపుతున్నాడు.

ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లపై ఎంబసీ స్టిక్కర్లు, దౌత్య పాస్‌పోర్టులు, విదేశీ కరెన్సీ, దేశంలోని ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను ఉపయోగించాడు. అంతేకాకుండా, అతను మనీలాండరింగ్ కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

వెస్ట్ఆర్కిటికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేందుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖ నేతలతో దిగిన నకిలీ ఫొటోలను ఆ భవనంలో ఏర్పాటు చేశాడు. అయితే, అతను ఇటీవల ఎంబసీ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో అతని కార్యకలాపాలపై అనుమానం వచ్చిన పోలీసులు నకిలీ ఎంబసీ గుట్టును రట్టు చేశారు. వెస్ట్ఆర్కిటికాతో పాటు 12 మైక్రోనేషన్ల దౌత్య పాస్‌పోర్టులు, విదేశాంగ శాఖ స్టాంపులు ఉన్న దస్త్రాలు, 34 దేశాల స్టాంపులు, రూ. 44 లక్షల నగదు, దౌత్య నెంబర్ ప్లేటు, ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Harshvardhan Jain
Westarctica
job racket
fake embassy
Uttar Pradesh Police
Ghaziabad

More Telugu News