Supreme Court: కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court on Kanchagachibowli Tree Felling Makes Sensational Comments Again
  • నరికిన చెట్ల స్థానంలో మొక్కలు పెంచాలన్న కోర్టు
  • పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులను జైలుకు పంపిస్తామని హెచ్చరిక
కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని అధికారులకు సూచించింది. లేదంటే అధికారులను జైలుకు పంపిస్తామని మరోమారు హెచ్చరించింది. ఈ మేరకు హెచ్ సీయూ సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ భూమిలో పర్యావరణ పునరుద్ధరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను ధర్మాసనం పరిశీలించింది. గత విచారణలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించడానికి సమయం కావాలని అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేసి, నరికిన చెట్ల స్థానంలో మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది.

కంచగచ్చిబౌలి అటవీ ప్రాంతంలోనే ప్రత్యేకంగా జైలు నిర్మించి అధికారులను అందులోనే ఖైదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలంటూ విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈరోజు కంచగచ్చిబౌలి భూముల కేసును విచారించింది.
Supreme Court
Kanchagachibowli
Telangana
tree felling
environmental restoration
HCU
Justice Gavai
environmental damage
High Court University

More Telugu News