అప్పటికీ .. ఇప్పటికీ తేడా అదే: యండమూరి

  • నాటకాలు రాశానన్న యండమూరి 
  • నవలలు ఎక్కువగా చదివేవారని వెల్లడి
  • తన నవలల నుంచి వచ్చిన సినిమాలపై వివరణ 
  • ఆ విషయంలో అసంతృప్తి లేదని వ్యాఖ్య 
  • ఇప్పుడు దర్శకులే అన్నీ చేస్తున్నారన్న యండమూరి

యండమూరి వీరేంద్రనాథ్ .. తెలుగు నవలా సాహిత్యాన్ని కొత్త ఉత్సాహంతో పరుగులు తీయించిన రచయిత. ఆయన పుస్తకాలు ఎంతోమందిని ఆలోచింపజేశాయి. ఆయన రాసిన అనేక నవలలు, ఆ తరువాత కాలంలో సినిమాలుగా వచ్చాయి .. విజయాలను సాధించాయి. అలాంటి యండమూరి, ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్యూలో అనేక విషయాలు గురించి ప్రస్తావించారు.

" మొదట్లో నేను నాటకాలు రాసేవాడిని. ఆ తరువాత నవలా సాహిత్యం వైపు వచ్చాను. నవలలు ఎక్కువగా చదువుతున్నారని తెలిసి అవే రాయడం మొదలుపెట్టాను. నేను పోటీ అనుకున్నవారు విమర్శలు చేశారు .. అవి నేను పట్టించుకోలేదు. నేను రాసిన నవలలను సినిమాలుగా తీశారు. సినిమాకి కూడా నేనే రాస్తాను అని నేను ఎవరినీ అడగలేదు. నా నవలకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసిన తరువాత మిగతా విషయాలలో నేను జోక్యం చేసుకునేవాడిని కాదు" అని అన్నారు. 

" నా నవలలు సినిమాలుగా వచ్చినప్పుడు నేను చూసేవాడిని. ఏ సినిమా విషయంలోనూ అసంతృప్తి అనిపించలేదు. ఎందుకంటే సినిమాను సినిమాగానే తీయాలి. ఆ విషయం కోదండరామిరెడ్డిగారికి .. రాఘవేంద్రరావుగారికి బాగా తెలుసు. అప్పట్లో కథ ఒకరు .. స్క్రీన్ ప్లే ఒకరు .. సంభాషణలు ఒకరు రాసేవారు. అలా ఎవరి పని వాళ్లం చేసేవాళ్లం. ఇప్పటి మాదిరిగా దర్శకుడే అన్నీ చేసేయడం అప్పుడు ఉండేది కాదు" అని చెప్పారు. 



More Telugu News