Andre Russell: చివ‌రి మ్యాచ్ ఆడేసిన ఆండ్రీ ర‌స్సెల్‌.. ఎమోష‌న‌ల్ వీడియో ఇదిగో!

Andre Russell Farewell Innings Against Australia
  • ఇటీవ‌ల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రస్సెల్
  • ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 ఆడి ఆట‌కు వీడ్కోలు
  • ర‌స్సెల్‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ ఇచ్చిన ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు  
  • తాను ఆడిన చివ‌రి మ్యాచ్‌లోనూ ర‌స్సెల్ విధ్వంసం 
  • 15 బంతుల్లోనే 36 ప‌రుగులు బాదిన వైనం
వెస్టిండీస్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ ఆండ్రీ ర‌స్సెల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 ఆడి ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ సంద‌ర్భంగా ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ర‌స్సెల్‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ ఇచ్చారు. 

ఇక‌, తాను ఆడిన చివ‌రి మ్యాచ్‌లోనూ ర‌స్సెల్ విధ్వంసం సృష్టించాడు. 240 స్ట్రైక్‌రేటుతో 15 బంతుల్లోనే నాలుగు సిక్స‌ర్లు, రెండు ఫోర్లతో 36 ప‌రుగులు బాదాడు. దీంతో క‌రేబియ‌న్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లకు 172 ప‌రుగులు చేసింది. కానీ, ఆ త‌ర్వాత ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ఆసీస్ 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టార్గెట్‌ను ఈజీ ఛేజ్ చేసింది. దీంతో ర‌స్సెల్‌కు విజ‌యంతో గ్రాండ్ ఫేర్వెల్ ఇద్దామ‌నుకున్న వెస్టిండీస్‌కు నిరాశే ఎదురైంది.  

ఇదిలాఉంటే... 2019 నుంచి రస్సెల్ తన దేశం తరపున ప్రత్యేకంగా టీ20 ఆటగాడిగా ఉన్నాడు. అతను విండీస్‌ తరపున 84 టీ20లు ఆడాడు. 22.00 సగటుతో 1,078 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత‌ని అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 71. అలాగే ర‌స్సెల్‌ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు.

కాగా, రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒకే ఒక టెస్ట్ ఆడాడు. అలాగే 56 వన్డేల‌కు కూడా ప్రాతినిధ్యం వ‌హించాడు. వీటిలో 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. వన్డేల్లో అతను 31.84 సగటుతో 70 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ గణాంకాలు 4/35.

ఇక‌, రస్సెల్ అనేక టీ20 లీగ్‌లలో భారీ పాత్ర పోషించాడు. మొత్తంగా 561 మ్యాచ్‌ల్లో 26.39 సగటు, 168 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 9,316 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలర్‌గా అతను 25.85 సగటుతో 485 వికెట్లు పడగొట్టాడు.
Andre Russell
Andre Russell retirement
West Indies cricket
WI vs AUS
T20 cricket
cricket farewell
cricket news
Caribbean cricket
Russell stats
T20 leagues

More Telugu News