Tanushree Dutta: టాలీవుడ్ నటి తనుశ్రీ దత్తాకు సొంత ఇంట్లోనే నరకం.. ‘మీటూ’ యోధురాలి కన్నీటి ఆవేదన

Bollywood Actress Tanushree Dutta Faces 6 Years of Harassment
  • సొంత ఇంట్లో వేధింపులపై తనుశ్రీ కన్నీటి పర్యంతం
  • నేడో, రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడి
  • 2018లో ‘మీటూ’ ఆరోపణలతో సంచలనం 
  • తనుశ్రీకి అండగా అభిమానులు
భారతదేశంలో ‘మీటూ’ ఉద్యమానికి బాటలు వేసిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తన సొంత ఇంట్లోనే గత ఆరేళ్లుగా వేధింపులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ భావోద్వేగ వీడియోలో ఆమె సాయం కోసం వేడుకున్నారు. త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. "నేను ఈ వేధింపులతో విసిగిపోయాను! ఇది 2018 నుంచి కొనసాగుతోంది. నాకు సాయం చేయాలని పోలీసులను కోరాను. ఎవరైనా నాకు సహాయం చేయండి!" అని ఆమె తన వీడియో క్యాప్షన్‌లో రాసుకున్నారు.

కన్నీటి గాథ.. ఆరు సంవత్సరాల వేధింపులు
వీడియోలో తనుశ్రీ దత్తా ఆవేదనతో మాట్లాడుతూ "నా సొంత ఇంట్లో నన్ను వేధిస్తున్నారు. నేను పోలీసులకు కాల్ చేశాను. వారు నన్ను స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా నన్ను తీవ్రంగా వేధించారు" అని విలపించారు. తన ఆరోగ్యం క్షీణించిందని వివరించారు. "నా ఇంట్లో పనిమనిషిని కూడా పెట్టుకోలేను. కొందరు పనిమనిషిలా వచ్చి నా వస్తువులు దొంగిలించారు. నేనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది" అని ఆమె తన కష్టాలను వెల్లడించారు. ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు.

మీటూ నేపథ్యం.. పోరాటం, ఆపై నిరాశలు
తనుశ్రీ దత్తా 2018లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేసి దేశంలో ఈ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారు. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను అనుచితంగా స్పృశించారని, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, డైరెక్టర్ రాకేష్ సారంగ్, ప్రొడ్యూసర్ సమీ సిద్దిఖీలు ఈ విషయంలో సహకరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, 2019లో ముంబయి పోలీసులు ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపి, నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. 2025 మార్చిలో ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తనుశ్రీ  ప్రొటెస్ట్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది, ఆరోపణలు 2008 నాటివి కావడంతో చట్టపరమైన గడువు ముగిసిందని పేర్కొంది.

మానసిక వేదన.. అభిమానుల మద్దతు
రెండో వీడియోలో తనుశ్రీ రోజూ రాత్రి తన ఇంటి దగ్గర వినిపించే పెద్దపెద్ద శబ్దాలను రికార్డ్ చేసి షేర్ చేశారు. ఈ శబ్దాలు తనను మానసికంగా వేధిస్తున్నాయని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. "ఒక స్టార్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొవడం చూస్తే బాధగా ఉంది. దోషులను శిక్షించాలి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తనుశ్రీకి తక్షణ సహాయం అందించాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Tanushree Dutta
MeToo India
Nana Patekar
Bollywood actress
harassment
domestic harassment
Mumbai Police
Ganesh Acharya
Rakesh Sarang
Samee Siddiqui

More Telugu News