ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం



ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు సంతకం చేసి లేఖను హోంశాఖకు పంపించారు. కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్ ఖడ్ రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు.

తొలిరోజు కార్యకలాపాలు ముగిసి సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత ధన్ ఖడ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. కాగా, ఉపరాష్ట్రపతితో పాటు పలు పదవులు నిర్వర్తించిన జగదీప్ ధన్ ఖడ్ దేశానికి ఎంతో సేవలందించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.


More Telugu News